Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

కృష్ణమూర్తి తత్వం


ప్రశ్న : సైకో సోమాటిక్ వ్యాథి అంటే ఏమిటి? అది నయంచేసుకోవడానికి మార్గాలు ఏమిటో మీరు సూచించగలరా?

కృష్ణమూర్తి : సైకోసొమాటిక్ వ్యాధి నయంచేసుకోవడానికి మార్గాలు కనుక్కోవడం సాధ్యమని నేను అనుకోను. అసలు మనసుకు చికిత్స చేసే ఒక పద్దతిని వెతకడమే వ్యాధికి కారణమవుతున్నదేమో. ఒక మార్గం కని పెట్టాలి, ఒక పద్ధతిని అభ్యసించాలి అని అన్నప్పుడు దాని అర్థం- ఆలోచనలను హద్దుల్లో వుంచడం, అదుపు చేయడం, అణచి వేయడం అని. అంటే మనసుని అవగాహన చేసుకోక పోవడం. భౌతిక శరీరాన్ని మనసు వ్యాథిగ్రస్తం చేస్తుంది అనేదానిలో సందేహం లేదు. కోపంగా వున్నప్పుడు భోజనం చేస్తే కడుపులో నొప్పి, అజీర్ణం కలుగుతాయి. చాలా తీవ్రంగా ఎవరినైనా మీరు ద్వేషిస్తే శరీరం అనారోగ్యానికి గురి అవక తప్పదు. మనసుని ఒక ప్రత్యేకమైన విశ్వాసానికి పరిమితం చేస్తే మానసిక వైకల్యంగాని, నరాల సంబంధమైన జబ్బులు గాని కలుగుతాయి. అవి మళ్ళీ మీ శరీరంమీద ప్రభావం చూపుతాయి. ఇదంతా సైకోసోమాటిక్ ప్రక్రియలో భాగం. అయితే అన్ని వ్యాధులు సైకోసొమాటిక్ వే అనీ చెప్పడానికి వీల్లేదు. కానీ, భయమూ, ఆందోళన మొదలైన మానసికమైన కలతలు శరీర అనారోగ్యానికి తప్పక దారితీస్తాయి. కాబట్టి మనసును ఆరోగ్యవంతంగా చేయడం సాధ్యమేనా? మనలో చాలామంది సవ్యమైన ఆహారం తీసుకోవడం మొదలైన జాగ్రత్తలు పాటించి శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ద చూపుతుంటారు. ఇది అవసరమే. కాని మనసును దిగజారిపోకుండా వుంచుకుంటూ, ఎప్పుడూ ఆరోగ్యంగా, నవ్యనూతనంగా, అప్రమత్తంగా, సజీవంగా మనసుని వుంచుకోవాలనే శ్రద్ధ చాలా తక్కువమందికి వుంటుంది.

సరే, మనసు చెడిపోకుండా వుండాలంటే మరొకరిని అనుసరించడం ఏమాత్రం వుండకూడదు. అది స్వతంత్రంగా, స్వేచ్చగా వుండాలి. అయితే అట్లా స్వేచ్ఛగా వుండటానికి మన విద్యావిధానం మనకు సహాయపడటం లేదు. పైగా యీ దిగజారిపోతున్న సమాజంలో యిమిడిపోయేటట్లుగా మనల్ని తయారుచేస్తుంది. అప్పుడు మనసు కూడా దిగజారిపోతుంది. భయపడుతూ వుండాలనీ, యితర్లతో పోటీపడాలని, మన గురించీ, మన భద్రత గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలనీ బాల్యం నుండీ మనకు నూరిపోస్తారు. దీనివల్ల మనసు నిరంతరమైన సంఘర్షణకు లోనవడం సహజమే. ఆ సంఘర్షణ ఫలితం శరీరం మీద కనబడుతుంది. కనుక యీ సంఘర్షణ అనే ప్రక్రియనంతా అప్రమత్తమైన జాగరూకత వహించి మనంతట మనమే తెలుసుకుంటూ, అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. అంతే తప్ప మనస్తత్వ శాస్త్రజ్ఞుడి మీదనో, గురువు మీదనో ఆధారపడకూడదు. ఒక గురువుని