Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

కృష్ణమూర్తి తత్వం

సంఘర్షణలతోను, అహాన్ని పెంచుకోవడంలోను, నిరాశానిస్పృహలలోను మీరు గడుపుతుంటారు కాబట్టి, సర్! మీ జీవితం వైపు రాజకీయ, సామాజిక, మతపరమైన మీ జీవితాలవైపు మీరే ఒకసారి చూసుకోండి. ఏదో అవాలని మీరు ఎప్పుడూ ప్రయాసపడుతూ వుంటారు. రాజకీయాల్లో గొప్ప అధికారస్థానంలో వుండాలనీ, హోదా, ప్రతిష్ఠ సంపాదించాలనీ కోరుకుంటుంటారు. మీ దృష్టి యింకెవరి వైపో తిప్పకండి. మంత్రుల దిక్కుగా చూడకండి. అవన్నీ మీకు దొరికితే మీరూ అట్లాగే ప్రవర్తిస్తారు. కాబట్టి, రాజకీయాల్లో ప్రయాసపడుతున్నారు, మిమ్మల్ని మీరు యింకా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు, అవునా కాదా? దానివల్ల మీరు సంఘర్షణను సృష్టిస్తున్నారు. 'నా' ను కాదనలేరు, వదులుకోలేరు. పైగా 'నా' కు యింకా ఎక్కువ బలాన్ని చేకూరుస్తుంటారు. ఇతర విషయాలకు సంబంధించి కూడా, ఆస్తిపాస్తుల అధికారం విషయంలో, మీరు అనుసరించే మతవిషయంలో యిదే పద్ధతి అవలంబిస్తుంటారు. మీరు చేస్తున్న వాటిల్లో, మీరు పాటిస్తున్న మతాచారాల్లో అర్ధంలేదు. వట్టి నమ్మకం, అంతే. కొన్ని పేర్లనీ, మాటలనీ పట్టుకొని వేళ్ళాడుతుంటారు. పరిశీలించి చూశారంటే అక్కడ కూడా కేంద్రస్థానం అయిన 'నా' గురించిన స్పృహ నుండి స్వేచ్ఛ లేదు. ఒక పక్కన మీ మతం అహాన్ని మర్చిపొమ్మని చెప్తూనే వుంటుంది. కాని మీ పద్ధతి అంతా మీ స్వార్దానికి యింకా బలం చేకూర్చుకోవడానికే; మీరే అన్నింటికంటే అతి ముఖ్యమైన జీవి. గీత చదువుతారు, బైబిల్ చదువుతారు. కాని మీరు మాత్రం మంత్రిగానే మిగిలిపోతారు. బలహీనుల్ని దోపిడీ చేస్తూ, ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ, గుళ్ళూ గోపురాలూ కట్టిస్తూ వుంటారు.

కాబట్టి ఏ రంగంలో, ఏ కార్యకలాపంలో మునిగితేలుతున్నా మీ స్వార్థాన్ని, మీ ప్రాముఖ్యతను, మీ ప్రతిష్టను, మీ భద్రతను గట్టిచేసుకుంటుంటారు. అందువల్ల స్వార్థాన్ని మర్చిపోవడానికి ఒకే ఒక మార్గం మిగిలింది. అదే సెక్సు. అందుకని ఆ స్త్రీకాని, ఆ పురుషుడు కాని మీకు చాలా ముఖ్యం అవుతారు. అందుకని వారిని మీరు స్వంతం చేసుకొని తీరాలి. కాబట్టి యీ స్వంతం చేసుకోవడాన్ని అమలులో పెట్టి, స్వాధీనంలో వుంచుకునే భరోసాను సమకూర్చే సమాజాన్ని మీరు నిర్మించుకుంటారు. తక్కిన అన్నింటిలోనూ 'నేను' కే ప్రాధాన్యం; సహజంగానే సెక్స్ చాలా ముఖ్యమైన సమస్య అయి కూర్చుంటుంది. సర్! యిటువంటి స్థితిలో పరస్పర వైరుధ్యాలు లేకుండా, బాధ లేకుండా, నిస్పృహ లేకుండా జీవించడం సాధ్యం అని మీరనుకుంటున్నారా? అయితే మతంలో కాని, సామాజిక కార్యకలాపాల్లో కాని నిజంగానే, చిత్త శుద్ధిగా స్వార్థచింతన లేనప్పుడు సెక్స్ కు యింత పెద్ద స్థానం వుండదు.