Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

83

మాట్లాడగల, యుద్ధాలు ఆపే మార్గాలు కనుక్కోగల గొప్ప మానవులం అని మీరు అనుకుంటుంటారు. వీటివల్ల ఏం లాభంలేదు. ఎందుకంటే అసలు ముఖ్యమైన విషయాలని మీరు పరిష్కరించనే లేదు.

ఇక, సమస్యలోని రెండో భాగం సెక్స్; సెక్స్ కి యింతకి ప్రాముఖ్యం ఎందుకు వచ్చిందీ అని ఈ వాంఛ మీమీద యింతటి ప్రాబల్యం ఎట్లా సంపాదించింది? అని మీరెప్పుడైనా ఆలోచించారా? అందులో మునిగితేలుతూ వుంటారు కాబట్టి ఆ సంగతి మీరెప్పుడూ ఆలోచించలేదు. అసలు యి సమస్య ఎందుకున్నది అన్నది కూడా మీరెప్పుడూ అన్వేషించలేదు. సర్! యీ సమస్య ఎందుకు కలిగిందని మీరు అనుకుంటున్నారు? దానితో తలపడాల్సివచ్చినప్పుడు దానిని పూర్తిగా అణచి వేసుకుంటే ఏమవుతుంది - బ్రహ్మచర్యం అనే ఆదర్శం మొదలైనవి మీకు తెలుసు. అప్పుడు ఏం జరుగుతుంది? సమస్య అట్లాగే వుండిపోతుంది. స్త్రీని గురించి ఎవరైనా మాట్లాడితే మీరు సహించలేరు మీలో వున్న లైంగిక వాంఛలను పూర్తిగా అణుచు కోవడం ద్వారా సమస్యని పరిష్కారం చేయచ్చని మీరనుకుంటారు, కాని అది మిమ్మల్ని వదలకుండా వెంటాడుతుంది. ఇది ఎట్లా వుంటుందంటే ఒక యింట్లో మీరు నివసిస్తూ, వికారంగా వుండే వస్తువులన్నీ ఒక గదిలో పడేసి దాచినట్లు. అయితే అవన్నీ యింకా యింట్లోనే వుంటాయి. కాబట్టి, క్రమశిక్షణ ద్వారా యీ సమస్యని పరిష్కారం చేయలేము. క్రమశిక్షణ అంటే యిక్కడ నిగ్రహంచుకోవడం, అణచివేసుకోవడం, మనసు మరో దాని మీదకు మళ్ళించడం. ఇవన్నీ మీరు ప్రయత్నించారు. బయటపడే మార్గం యిది కాదు. మరి ఏది దారి? సమస్యని అవగాహన చేసుకోవడమే మార్గం. అవగాహన చేసుకోవడం అంటే ఖండించడమూ కాదు, సమర్ధించడమూ కాదు. అదేమిటో యిప్పుడు మనం చూద్దాం.

మీ జీవితాల్లో సెక్స్ యింత ప్రధానమైన సమస్యగా ఎందుకు తయారయింది? లైంగిక చర్య, ఆ భావన తననితాను మరిచిపోవడానికి ఒక మార్గం కాదూ? నేను అంటున్నదేమిటో మీకు అర్ధం అవుతున్నదా? ఆ చర్యలో యిద్దరూ సంపూర్ణంగా ఐక్యం కావడం జరుగుతుంది. ఆ క్షణంలో సంఘర్షణలన్నీ పూర్తిగా ఆగిపోతాయి. అపారమైన సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన అస్తిత్వంతో వుండవలసిన అవసరం అప్పుడు మీకు వుండదు. పైగా ఎప్పుడు మిమ్మల్ని నమిలివేస్తూ వుండే భయం కూడా అప్పుడు వుండదు. అంటే అర్ధం, ఒక క్షణం సేపు స్వీయ స్పృహ మాయమవుతుంది. మిమ్మల్ని మీరు మర్చిపోవడంలో వుండే నిర్మలత్వం, స్వార్థాన్ని తోసివేయడంలో వుండే ఆనందం మీకు తెలుస్తాయి. సెక్స్ చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది, ఎందుకంటే జీవితంలో ఏ వైపు చూసినా