82
కృష్ణమూర్తి తత్వం
కాబట్టి యీ ప్రక్రియనంతా, యిదంతా అసహ్యకరమైనది అని కాకుండా, మీ కళ్ళముందు జరుగుతున్న ఒక నిజమైన వాస్తవం అని గ్రహించడం ముఖ్యం. అది గ్రహించాక, అప్పుడు మీరు ఏం చేస్తారు? దానిని అట్లాగే వదిలివేయలేరు కాబట్టి, అయినా దానివైపు చూడటం మీకు యిష్టం లేదు కాబట్టి, త్రాగుడునో, రాజకీయాలనో, సమీపంలో వున్న మరో స్త్రీనో అలవరచుకుంటారు. ఏదయినా ఫరవాలేదు, అదీ మీ యింటినుంచీ, సాధించే మీ భార్యనుంచో లేదా భర్త నుంచో దూరంగా తీసుకొనిపోతే చాలు. ఆ విధంగా సమస్యని పరిష్కరించి వేశానని అనుకుంటారు. అదీ మీ జీవితం. కాదంటారా? అందువల్ల, యీ సంగతేదో మీరు తేల్చుకోవాలి. అంటే సమస్యని నేరుగా ఎదుర్కోవాలి అని అర్థం. అంటే ఏమిటంటే, అవసరమైతే విడిపోవాలి. ఎందుకంటే తల్లిదండ్రి అస్తమానం ఒకరి నొకరు సాధించుకుంటూ, పేచీలు పడుతూవుంటే దాని ప్రభావం పిల్లల మీద పడకుండా వుంటుందా?
కాబట్టి వివాహాన్ని ఒక అలవాటుగా, ప్రతిరోజూ సుఖాన్ని అందజేసేదానిగా అలవరచుకుంటే, అది మనిషి దిగజారిపోవడానికి కారకమవుతుంది. ఎందుకంటే అలవాటులో ప్రేమ వుండదు. ప్రేమ అలవాటయిపోదు. ప్రేమ అంటే చాలా వుల్లాసకరమైనది. సృజనాత్మకమైనది. నవ్యనూతనమైనది. అందుకని అలవాటు ప్రేమకి పూర్తిగా ప్రతికూలమైనది. అయితే మీరు అలవాటులో చిక్కుకుపోయారు. ఎదుటివారితో మీ బాంధవ్యం అలవాటుగా మారిందంటే అది నిస్సందేహంగా నిర్జీవమై పోయినట్లే. కాబట్టి మనం మళ్ళీ అసలు మూలవిషయానికే వస్తున్నాం. అది ఏమిటంటే సమాజ సంస్కరణ జరగాలంటే అది మీ మీదే ఆధారపడి వుంది. న్యాయశాసనాల మీద కాదు. చట్టాల వల్ల మళ్లీ కొత్త అలవాట్లు, లొంగి పోయివుండటం ఎక్కువవుతాయి, అంతే. కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తిగా సంబంధ బాంధవ్యాల విషయంలో మీరు ఏదయినా చేయాలి- చర్య తీసుకోవాలి. అయితే మీ మనసు, హృదయమూ జాగృతం అయినప్పుడే చర్య తీసుకోగలుగుతారు. మీలో కొంతమంది నాతో ఏకీభవిస్తున్నట్లుగా తలలు ఆడిస్తున్నారు. కానీ పరిణామమూ, మార్పూ తీసుకొనివచ్చే బాధ్యత మీపై వేసుకోవడం మీకు యిష్టంలేదనే వాస్తవం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నది, సవ్యంగా జీవించడం ఎట్లా అన్నది కనిపెట్టడం అనే పెద్ద అల్లకల్లోలాన్ని నెత్తిన వేసుకోవడం మీకు యిష్టం వుండదు. అందువల్ల సమస్య అట్లాగే వుండిపోతుంది. కలహించుకుంటుంటారు, మళ్ళీ సర్దుకుపోతుంటారు; చివరకు మీరు చనిపోతారు, చనిపోతే ఏడవడానికి ఎవరో ఒకరు వుంటారు. ఏడుపు చనిపోయినవారిని గురించి కాదు, తను ఒంటరితనం తలుచుకొని. ఏ మార్పూ లేకుండానే మీరు గడిపివేస్తూ వుంటారు. అయినా, చట్టాలు చేయగల, గొప్ప పదవులు చేపట్టగల, దేవుణ్ణి గురించి