సందేహాలు, సమాధానాలు
81
ప్రేమ. కాని మీకు ప్రేమ లేదు, అదీ స్పష్టంగా కనబడుతున్న వాస్తవం. ప్రేమ ఎప్పుడూ కొత్తగా, నవ్య నూతనంగా వుంటుంది. అది కేవలం కోరికలు తృప్తి పరచుకోవడం కాదు. వట్టి అలవాటూ కాదు. దానికి ఏ షరతులు వుండవు. మీ భర్తని, లేదో భార్యని మీరు యీ విధంగా చూడరు. అవునా? మీ ఏకాంతవాసంలో మీరు నివసిస్తుంటారు, తన ఏకాంతవాసంలో ఆమె నివసిస్తుంటుంది. అయినా నిరాటంకంగా సెక్స్ సుఖపు అలవాట్లను సాగించుకుంటూ వుంటారు, ఒక స్థిరమైన ఆదాయం క్రమం తప్పకుండా వస్తూ వుంటే ఆ వ్యక్తి ఏమై పోతాడు? నిస్సందేహంగా దిగజారి పోతాడు. మీరా సంగతి గమనించలేదూ? స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్న ఒక వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి. అతని బుద్ధి అతివేగంగా శుష్కించి పోతూ వుండటం మీరు చూడవచ్చు. అతను గొప్ప పదవిలో వుండవచ్చు, మహా చాతుర్యంగల వాడనే ఖ్యాతి వుండచ్చు. అయితే జీవితంలోని అసలైన ఆనందాన్ని మాత్రం అతను కోల్పోయాడనే చెప్పాలి.
అదే విధంగా మీ వివాహం- నిరంతరంగా సుఖాన్ని అందిస్తూ వుండే ఒక శాశ్వతమైన గని. అవగాహన అన్నది లేనీ, ప్రేమ అన్నదీ లేని ఒక అలవాటు. అందులోనే మీరు జీవించక తప్పదు. మరో గత్యంతరం లేదు. ఫలానా విధంగా మీరు చేయాలి అని నేను చెప్పడం లేదు. కానీ అసలు సమస్యవైపు దృష్టి సారించమంటున్నాను. అదంతా సబబుగా వుందని మీరనుకుంటున్నారా? అంటే మీ భార్యని వదిలేసి మీరు మరొకరి వెంటపడాలని కాదు అర్థం. అసలు యీ బాంధవ్యంలోని అర్థం ఏమిటి? ప్రేమించడం అంటే అన్యోన్యత. మీ భార్యతో మీకు అన్యోన్యమైన సంబంధం వున్నదా? శారీరకంగా కాకుండా ఆమెని గురించి మీకు తెలుసా, ఆమె శరీరం కాక? ఆమెకి మీ గురించి తెలుసా? మీ యిద్దరూ ఎవరి ఏకాంతవాసంలో వారు వుంటూ, మీ మీ స్వాభిలాషలు నెరవేర్చుకుంటూ, మీ ఆకాంక్షలు, మీ అవసరాలు వెతుక్కుంటూ, మీ విషయ తృప్తికై, ఆర్థికమైన లేదా మానసికమైన భద్రతకై ఒకరినొకరు వుపయోగించుకోవడం లేదూ? ఇటువంటి బాంధవ్యం నిజమైన బాంధవ్యం కానే కాదు- ఇది మానసిక, శారీరక, ఆర్థిక అవసరాలను పరస్పరమూ స్వార్థ పూరితంగా నెరవేర్చుకొనే ఒక విధానం- దీనిలో నుంచి సంఘర్షణ, క్షోభ, సాధించుకోవడం, స్వంతంచేసుకోవాలనే ఆదుర్దా, అసూయ మొదలైనవి పుట్టుకొస్తాయనడంలో సందేహం లేదు. ఇటువంటి బాంధవ్యం ఫలితంగా వికృతమైన శిశువులు, వికృతమైన నాగరికత తప్ప మరొకటి జనిస్తుందా?