Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

కృష్ణమూర్తి తత్వం

తమ ప్రజలను రక్షించుకోవాలనే సంగతి ప్రతి ప్రభుత్వమూ నిజంగానే కనుక పట్టించు కుంటే, అప్పుడు యుద్దాలు వుండవు. కాని ప్రభుత్వాలకు కూడా మతిస్థిరత్వం పోయినట్లే కనబడుతున్నది. వాళ్ళకి కావలసినదల్లా పార్టీ రాజకీయాలు, వాళ్ళ అధికారం, వాళ్ళ పదవులు, వాళ్ళ పలుకుబడి- అవన్నీ, ఆ నాటకం అంతా మీకు తెలుసు.

కాబట్టి, కాలాన్ని లెక్కలోకి తీసుకోకుండా, అంటే రేపు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, యివాళ ఆత్యంత ప్రధానం అన్నట్లుగా మనం జీవించగలమా? అంటే అర్థం, మన ప్రతిస్పందనల ఎడల, మనలోని గందరగోళం ఎడల అశేషమైన జాగరకతతో వుండాలి. మన పై మనమే ఒక పరమావేశాన్ని ప్రయోగించుకోవాలి. మనం చేయగలిగిన పని యిదొక్కటేగా కనబడుతున్నది. ఇది కనుక మనం చేయకపోతే మానవుడికి భవిష్యత్తు లేదు. పత్రికల్లో వస్తున్న పతాక శీర్షికలను మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. యుద్ధం కోసం జరుగుతున్న సన్నాహాలను గురించీ. సన్నాహాలు జరుగుతున్నాయంటే అది తప్పక జరిగి తీరుతుందన్నమాటే- వంటకాలు తయారు అవుతున్నట్లుగా. ప్రపంచంలోని సామాన్య ప్రజలకీ సంగతి పట్టినట్లు లేదు. మారణాయుధాల తయారీలో మేధాపరంగా, వైజ్ఞానికంగా పాల్గొంటున్న వాళ్ళూ లక్ష్యపెట్టడం లేదు. వాళ్ళకు కావలసినదల్లా తమ వృత్తిలో పైకి పోవడం, తమ వుద్యోగాలు, తమ పరిశోధనో. చాలా సామాన్య పౌరులుగా లెక్కించబడే మనలాటి వాళ్ళం, మధ్య తరగతి అని పిలవబడే మనం కూడా కనుక లక్ష్య పెట్టకపోతే మాత్రం మనమంతా నడి సముద్రంలో దూకినట్లే. ఇందులోని విషాదం ఏమిటంటే మనం యిది లెక్క చేస్తున్నట్లుగా కనబడటంలేదు. అందరం కలసి ఒకచోట చేరడం, కలిసి ఆలోచించడం, కలిసి పనిచేయడం లేనే లేదు. సంస్థల్లోనూ, సభల్లోనూ చేరడానికి మాత్రం చాలా వుత్సాహం చూపుతాం, అవీ యీ యుద్దాలు, యీ నరికి పోగులు పెట్టుకోవడాలు ఆపు చేస్తాయని ఆశపడతాం. ఇంతవరకూ ఆవి ఏమీ చేయలేదు. సభలూ, సంస్థలు వీటిని ఆపడం అనేది జరగదు. మానవ హృదయమే, మానవ మస్తిష్కమే అసలు యీ పనులను చేయిస్తున్నది. దయచేసి యివి ఆవేశంతో అంటున్న మాటలని అనుకోకండి. నిజంగానే చాలా గొప్ప వుపద్రవాన్ని మనం ముఖాముఖీగా ఎదుర్కోబోతున్నాం. ఇందులో పాల్గొంటున్న చాలా ప్రముఖులైనవారిని మేము కలుసుకున్నాం. వారు యీ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వున్నారు. మనం కనుక యిది పట్టించుకున్నట్లయితే, మన నిత్యజీవితాన్ని సవ్యంగా గడుపుతే, ప్రతిరోజూ మనం ఏం చేస్తున్నామన్న స్పృహ మనలో వుంటే, అప్పుడు భవిష్యత్తు కొంత ఆశాజనకంగా వుంటుంది.

(మీటింగ్ లైఫ్)