పుట:కుమారసంభవము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

కుమారసంభవము


వ॥

ఇట్లు శతానందుండు సదానందకందళితహృదయారవిందుండగుచున్నంత
బృందారకబృందంబు గాందిశీకులై కంది తదీయాననారవిందమకరం
దంబుల కెఱఁగునలిసందోహంబునుంబోలె నెఱఁగి నానావిధస్తుతిరవంబు లురి
య నభయ మభయ మనుచున్నదేవేంద్రాదిగణంబులం గని విరించి గరుణించి
యోడక లెండని.

364


క॥

మీ కింత వంది కంద భ । యాకులతం బొంది నిర్గతైశ్వరులరై
రాకకుఁ గారణ మేమి త్రి । లోకాహితదనుజతతికి లోఁబడరువరే.

365


వ॥

అని తమవచ్చినకార్యస్వరూపంబున కనురూపంబుగా నానతియిచ్చినవాక్పతికి
బృహస్పతి నిటలతటఘటితకరకమలముకుతపుటవిలసింతుండై తారకాసురుబారిం
బడి తమబ్రదికి వచ్చినవృత్తాంతం బెల్ల నెఱింగించి వానిదోషవిశేషంబులు
విజ్ఞాపింపందలంచి యిట్లనియె.

366


సీ॥

వేళ్ళతోడుతఁ గల్పవృక్షముల్ పెఱికించి కొనిపోయి తన కుపవనము జేసెఁ
గనకాద్రి గొనిపోయి తన కెక్కియాడ నిజారామభూమిఁ గ్రీడాద్రిఁ జేసె
నమరారి దనపేరియచ్చులు వెట్టించి సురధేనుసమితిఁ గీలరము సేసె
గరుడోరగామరతరుణుల నందఱఁ జేకొని తనవిలాసినులఁ జేసె
వేదవిహితవృత్తి విప్రుల నుఱిచెఁ దత్సతులపురుషభక్తి సలుపు దుడిచెఁ
బుణ్యకర్మ ముఱిచె భువి నిట్లు నిఖిలాపకారకుండు బలిమిఁ దారకుండు.

367


మ॥

తన తేజం బహిమాంశువై తనమహత్త్వం బావసంస్తోమమై
తనకోపోన్నతి రుద్రులై తనమహెూత్సాహంబు సిద్ధాదులై
తనచె న్నశ్వినులై వెలుంగఁ దనదోర్దర్పంబు దిక్పాలురై
చన గీర్వాణనియోగము ల్గొని నిజేచ్ఛం దాన పాలించెడున్.

368


క॥

అనిమిషపురముల నెల్లం । దనబలునాయకుల నిల్పదలఁచినవాఁడై
దనుజేంద్రుఁడు గోల్కొననీ । కనిశముఁ బోఁదోలుచుండు నమరగణంబున్.

369


క॥

ఇలఁ జిత్రము తారకుకర । తలసంగత మైనఘోరతరవారి సొర
న్నిలు పగుఁ దనుఁ జొర కడరిన । దలమునుక యగు న్విరోధితతి కబ్జభవా.[1]

370
  1. “దెసలు చూడఁగనుండె దిగ్గను చక్రసమూహంబునకుఁ దలమును
    కలగుచు. ..... వెన్నెలనిట్టదోఁచె.” నిర్వ-ఆ-6