పుట:కుమారసంభవము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

కుమారసంభవము


గీ॥

హిమనగంబుపైఁ బొలుపొందు హేమశిఖర । మనఁగం దనరారు కెంజెడ ల్పెనచికట్టి
యందుఁ జుట్టినదివిజాపగామలప్ర । వాహమన నహిబంధంబు వఱల బిగిసి.

334


గీ॥

క్షీరవారాశి కెఱఁగిన కారుమొగులు । కరణి శశికాంతవేదిపై గౌరుతోలు
పరచి విలసిల్లు నందుండి పరమపరుఁడు । వొలిచె నొగిమొగులునైఁ దటిత్పుంజమనఁగ.

335


సీ॥

పద్మాసనస్థుఁడై భావించి శోషణదాహనఫ్లావనతర్పణముల
దేహోదయాత్మప్రతిష్ఠలు విధియించి యాగమరీతి బ్రహ్మాంగవర్ణ
విన్యాసములు దీర్చి విమలాత్మదీపంబు ప్రణవసంపుటముగాఁ బ్రజ్వలించి
వడి బాహ్యవర్తన ల్విడిచి ప్రత్యాహారగతి మనస్సంతర్ముఖమ్ము సేసి
తన్నుఁ దానె కాంచి తనయందుఁ జేతోలయంబు చేసి నిశ్చలాత్మయోగ
మయసుఖామృతాబ్ధి మగ్నుఁడై వరదుండు నిరతిశయసమాధినిష్ఠ నుండె.

336


క॥

ఆధ్యాత్మమూర్తి బ్రహ్మహ । రీధ్యేయాత్మకుఁడు సురవరేణ్యుఁడు సకలా
రాధ్యుఁడయి తనరు తాను స । మాధ్యవహితేలీయమానమానసుఁ డయ్యెన్.

337


గీ॥

తనకు బర మొండులేదనఁ డనరి వెలుఁగు । చుండు పరమేశ్వరుండు దా నుగ్రతపము
చేసె భక్తులు దనుఁ బ్రీతిఁ జేరవచ్చు । తెరువుఁ దాఁ దీర్చి చూపెడుతెఱఁగువోలె.

338


ఉ॥

అంతకుమున్న సన్మతి బురాంతకురాకయు వచ్చియున్నవృ
త్తాంతము మేలుగా నెఱిఁగి యాహిమవంతుఁ డనంతసంభ్రమా
త్యంతమనోనురాగమునప్పుడవాజివరూధదంతిసా
మంతవిలాసినీస్వజనమంత్రిపురోహితభృత్యయుక్తుఁడై.

339


వ॥

నిజాశేషకులకళత్రపుత్రీసమేతుండై చనుదెంచి పరమేశ్వరునిం గని ముహుర్ముహు
ర్మహీతలాలంకృతసర్వాంగుండై నిజదేహాదిసమస్తరాజ్యవిభవంబులు నీశ్వరు
శ్రీపాదంబులక నివేదించి.

340


క॥

వినుతించుచున్నగిరిపతిఁ । గని గిరీశుఁడు సన్మనమునఁ గారుణ్యాలో
కననార్థి సుధారసవా । రినిమగ్నునిఁ జేసి సురవరేణ్యునిఁ జేసెన్.

341


వ॥

ఇ ట్లచలాధీశ్వరుం డీశ్వరుకరుణామృతరసప్రవాహాఫ్లావితుం డగుచు నీశ్వరారా
ధనానంతసంతోషితాంతరంగుం డగుచు నుండునంత కొంతకాలంబునకు రుద్రుం
డు గిరీంద్రున కనేకవరంబు లొసంగి నిజపురంబున కరుగుమని నియోగించిన.

342