Jump to content

పుట:కుమారసంభవము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈకథ నితఁ డించుక మార్చి యున్నాడు. సంస్కృతకుమారసంభవకథలలో లేని గణపతిజననమును బార్వతీదాక్షాయణులు కైలాసవనభూముల స్వేచ్ఛగా విహరించు గజయూధములఁ జూచి యపూర్వరతిదత్తచిత్తులై గజరూపములు దాల్చి క్రీడింపఁగా గణేశ్వరుఁ డుద్భవించెననియు, రెండవది, శరవణమును సరస్సున సప్తర్షులభార్యలు జలక్రీడ సేయుచుండ నగ్నిహోత్రుఁడు మోహించి వారల సమీపంప వారిలో నరుంధతి తొలఁగినం దక్కినయార్గురును నగ్నిఁ బురుషునిగా గ్రహింపక శీతాపనోదనార్ధము నిరంబరలై సమీపింప నగ్ని వారిం గౌఁగిలించి తాను ధరించియుండిన శంభువీర్యభారమును దొలంగించుకొనెను. వారలు సద్యోగర్భంబు వడసి జడిసి గర్భపిండముల వెలార్చి కమలపత్రంబున నిడి యిండ్లకు మగిడి పతిశాపతప్త లయ్యుఁ బరమేశ్వరవీర్యధారణప్రభావంబున జ్యోతిర్లోకము సెందినట్లును మార్పులు కలిగించియున్నాడు. ఈమార్పు లీకవి చేసినవనియే యూహించెదను. ఎట్లైన నివి మనోరమములే. దీనిలో 12 ఆశ్వాసములలో 1200 పద్యములు గలవు. ముద్రితగ్రంథములలో లేని యపూర్వపదము లీకావ్యములోఁ గుప్పలుగా నున్నందున వాని సవరించి లేఖకదోషముల గుర్తెఱింగి సంస్కరించుటకు నవకాశము నాకుఁ జాలమిం జేసియు, నామిత్రులు పలువు రీకృతిలోఁ గొంతభాగమైన ప్రకటింప నన్నుఁ బురికొల్పుట వలనను, ఇటీవల నాకు లభించిన కొన్నిపూర్వకావ్యములు చక్కగా శోధించి ప్రాచీనపదసంగ్రహము చేసికొని దీని ముద్రించిన స్ఖాలిత్యములు మెండుగా నుండవనియు, పరదేశమునందు గ్రంథసామగ్రి చాలక యానుకూల్యము లేక యస్వతంత్రజీవనమున నకృతావకాశత్వమునను దీనిఁబూర్వభాగముగా నేడాశ్వాసములు 1000 పద్యములు మాత్రమే యిందుఁ బ్రచురించుచున్నాఁడను. ఈకృతి నన్నయభట్టుకంటే నూఱేండ్లు పూర్వము దైనను 1000 సంవత్సరములుగా నెవ్వరును గుర్తెఱుంగక యుండ దటస్థింపదనియు దీనిని నేనో మఱి యెవ్వరో రచించి గ్రంథప్రాశస్త్యమునకై ప్రాచీనులపేర వ్యవహరింపఁబడెననియు గ్రంథమును బ్రచురింపక మునుపే యొకవార్త పుట్టినది. ఇట్టివార్తను ఖండింపకున్న మహాపాపము. నాయట్టివాని కిట్టి కావ్యమును వ్రాయ సామర్థ్యము లే దనుట తెల్ల మనుట గాక నాచనసోమునికిఁ దరువాత నిట్టి కవిత గూర్చువాఁడే యాంధ్రదేశమునఁ బుట్టినవాడు కాఁడు. అధునాతనకవులలో నిట్టివాఁడు గల్గిన వాఁడు నిర్లజ్జుఁడై తననామగోపనము సేయ హేతువు గానరాదు. ఈకవి ప్రఖ్యాతుఁడు కాకపోవుటకుఁ గారణము :—

బహుళో సామాన్య మతిత్వేన తేషాంపరిగ్రహేలోకే, కామంగతాప్రసిద్ధిం సామాన్య కవయః అతవివ" అని యూహించవలయు. అయిననుఁ గుమారసంభవములోని పద్యము లథర్వణచ్ఛందము, పెద్దన లక్షణసారసంగ్రహము, కవిసంజీవని, రత్నాకరము, లక్షణశిరోమణి, వీనిలో నుదాహరింపఁబడినవి. అథర్వణుఁడు:-