పుట:కుమారసంభవము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయశ్వాసము

23


మ॥

అమృతాంభోధి మధింప మందర మనంతాహిశుఁడేఁ బంచె శై
లము దాల్పన్ హరి బంచె మీఁద నజు నిల్పంబంచె వాసుక్యుఁ గ
వ్వముద్రాడై గిరి సుట్టఁబంచె వడిఁ దివ్వంబంచె దేవాసురౌ
ఘము సర్వేశుఁడు రాజుగాఁడె యెఱుఁగంగా రాదె నీ కెమ్మెయిన్.

172


సీ॥

విశ్వంబు కావింప విశ్వాత్ముఁడై యష్టతనువులు సేకొని తనరువాని
నురులింగరూప హరివేధలకుఁ దనకడగానరా కున్నపొడవువాని
శరణార్థులకు దయావరములు నైశ్వర్యమూర్తి సేకొని యున్నకీర్తివాని
వార కనేకావతారముల్ హరి కురుకల్పంబు లజునకుఁ కఱవానిఁ
దా నచింత్యుఁ డనంతుఁ డనూనదాన । నిరతుఁ డక్షయుఁ డన నున్నపరముఁ
బరమయోగి నిశ్చలనిర్మలయోగబుద్ధి । నెఱుఁగ గా కీశుమహిను నీ కెఱుఁగగరాదె.

173


వ॥

అనిన విని దక్షప్రజాపతి పశుపతి వేదబాహ్యుం డని తనపట్టినప్రతినయ పట్టి
క్రాలుచు వెండియు ననేకప్రకారంబుల దూషించుచున్న విని సతీదేవి హరిపర
మేష్టిపురందరబృందారక మునిబృందంబుల వేదంబుల ననలంబులం జూచి పర
మేశ్వరుండు మఖంబులం దపూజ్యుండే యనిన విని భయంబున నడనడ నడుం
గుచు దక్షు నిరాకరించి సమస్తలోకాగమంబులకుం గర్తయుం గర్మఫలప్రదా
తయు మఖప్రయోగాద్యఖిలపూజాస్థానంబులయందు నీశ్వరుండు పూజ్యుండు
గాఁ బ్రతిష్ఠించి బ్రహ్మవిష్ణువు లిట్లనిరి.

174


క॥

ఏ మాదిమూర్తిదక్షిణ । వామాంగమునందుఁ బుట్టి వారక జననో
ద్దామపరిపాలనాదిమ । హామహిమలు వొందఁ గంటి మాశివుకరుణన్.

175


వ॥

అని యందఱుం బ్రత్యేకంబ యివ్విధంబునం బలికిన విని దక్షుం డందఱ నా
క్షేపించి మీరు భిక్షువలనిభయంబున దాక్షాయణిపక్షంబునం బలికినం గర్మ
బాహ్యుం డైనపాషండుండు పూజ్యుం డగునె యని యెవ్వరిం గైకొనక
మీఁదులేక పలికిన విని సతీదేవి కోపోద్దీపితహృదయయై దక్షు నాహుతిగొన
నెగయునట్లు నడరిమేనిలో దనరుకోపాగ్నిధూమసమితి ముడివడి వడన రం
ధ్రముల వెడలె.

176


ఆ॥

అధిపుఁ బలుకఁబలుక నడరి యాకాశంబు । దాఁకి సతిమనమున్నదరతరంబ
మాన కగ్నిలోన మలఁగ నే వోసిన । మాడ్కిఁ గోపవహ్ని మండి యెగసె.

177