పుట:కుమారసంభవము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

కుమారసంభవము


మఘవుండు నీకంటె మరులైయె క్రతుతతి నర్చించి దేవేంద్రుఁడై వెలింగె
నిఖిలదేవాలియు నీకంటె నవివేకులయియె సేవించి భోగాత్ము లైరి
వీర లిందఱకంటెను వెరవుమిగుల । నెఱుక ని కిప్పు డెందుండి దొఱకిపడియె
నగణితైశ్వర్యు శివుఁ బరమాత్ము నెఱిఁగి । యెఱిఁగి దూషింప నీకు నోరెట్టులాడె.

164


క॥

వాదున నీహరి వేధయు । గాదే యురులింగమూర్తి కడగానక నేఁ
డాదిగ వెదకెద రట్టిమ । హాదేవుఁ డపూజ్యుఁ డనఁగ నెగునే నీకున్.

165


చ॥

హరుఁ జెడనాడి వీరి కొనియాడెదు పెద్దయు నీవు చూడఁగా
గరళము మ్రింగి త్రైభువనకంటకు లైన గజాసురాదులం
బరువడి నోర్చి విశ్వము శుభస్థితి నిల్పినవాఁడు దొల్లి నీ
హరియె పితామహుండె దివిజాధిపుఁడే సురలే మునీంద్రులే.

166


మ॥

హరునిగ్మించినవేదమార్గములు గా కాయాగముల్ సేయఁగా
వెర వొండెయ్యెది సద్విధిం గ్రతుసమాప్తిం బొందినన్ మిట్టినా
వరదుం డొక్కఁడు దక్కఁ దత్ఫలము లెవ్వం డీ సమర్థుండు నీ
సురసంఘంబులలోన నంచు సతి దక్షుం దూలఁబోఁ బల్కుచున్.

167


వ॥

ఇట్లు పరమేశ్వరు వేదకర్తయు సకలకర్మఫలదాతయుఁగాఁ బల్కిన దక్షుండు
దుర్మదంబున సహింపక వెండియు నిట్లనియె.

168


ఉ॥

ఎన్నఁడుఁ దొల్లి చర్మములు నెమ్ములు భూతియుఁ దాల్చి తాపసుల్
జన్నములందుఁ జొర్తురె విచారములేక సురేశ్వరాదులం
బన్నములాడి నీమగనిపక్షము వల్కెదు గాక బేల నీ
కొన్నమరుల్ జగజ్జనులు గొందురె వ్రాత్యులఁ బూజ్యు లందురే.

169


వ॥

అనిన విని సతీదేవి కోపోద్దీపితచిత్తయై.

170


చ॥

అఱిముఱి రుద్రు నెంతచెడనాడెదు సోమము ద్రాగియున్కి మై
యెఱుఁగక బిఱ్ఱెదో కలయ నిమ్మఖధూమము గప్పికొన్న దు
త్తుఱుగొని ప్రేలెదో ముదిసి దుర్మతివై కడు విభ్రమించి మై
మఱచితొ కాలకాలు నజమస్తకసంహరు నిట్లుపల్కుటే.

171