పుట:కుమారసంభవము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

19


సీ॥

హరిపితామహపురందరలోకపాలార్కవసురుద్రసురవైద్యవరమునీంద్ర
చారణగరుడప్రజాపతికిన్నరగంధర్వరాక్షసఖచరసిద్ధ
సాధ్యసురాహిపిశాచమరుద్గ్రహవిద్యాధరాప్పరోవిప్రమనుజ
దిక్కులశైలనదీసాగరాగమధర్మవేదపురాణతర్కశాస్త్ర
నిచయమాదిగాఁగ సచరాచరాత్మకం । జగుపదార్థ మెల్ల నాక్షణంబ
తగువిభూతి మెఱసి దక్షప్రజాపతి । యజ్ఞమునకు వచ్చె నతిముదమున.

143


వ॥

తదనంతరంబ నిజకులపాలికాసమన్వితులై కశ్యపయమచంద్రులు దమతమ
విభవంబులు మెఱసి మహోత్సాహంబునం జనుదెంచి రంత నఖిలభువనాధీశ్వ
రాకీర్ణంబై కలకలస్యాదిసమస్తవస్తుసంపూర్ణంబై యతిరమణీయం బగునిజ
పురోత్సవంబు గని పరమానందహృదయుండై దక్షప్రజాపతి బృహస్పతిదత్తసు
ముహూర్తంబునం గ్రతుదీక్షితుండై పటుపటహపణవభంభడుత్తుంభమృదంగ
శంఖకాహళకాంస్యవేణువీణాతతవితతవిపంచికాఘనసుషిరాద్యాతోద్యధ్వానం
బుల నధ్వకరించి మంగళపాఠకపఠనానూనగానవేదాశీర్వాది నాదంబులు నిర్మధ్య
మానసముద్రఘోషంబు నధఃకరించి మ్రోయుఘనగర్జనరవంబులుంబోలె రోద
సీవివరాపూరితంబులై మహాధ్వని సెలంగుచుండ.

144


క॥

బ్రహ్మరథ మెక్కి విష్ణు । బ్రహ్మాదికసకలదేవపరివృతుఁడై యా
బ్రహ్మఋషిసుతుఁడు దక్ష । బ్రహ్మ లసద్యాగమంటపంబున కరిగెన్.

145


వ॥

ఇ ట్లధికతరవిభూతితో ధర్మపత్నీసమేతుండై యజ్ఞోపకరణద్రవ్యాద్యనేకద్రవ్య
పరిపూర్ణంబై నానావిధాలంకారాలంకారాలంకృతంబై యతిరమణీయం బైన
యజ్ఞశాల ప్రవేశించి యజమానస్థానంబు నలంకరించు చుండె నంత విధివిహిత
విధానంబుగ ఋత్విగ్గణంబులు త్రికుండంబుల జాతవేదాహ్వానంబు సేసి
యథాక్రమంబున హోమంబు సేయం దొడంగి రంత నక్కడ.

146


క॥

తనవిభవము దక్షుఁడు ద్రిణ । యనుదేవికిఁ జూపి మెఱయ సని ముందఱు వం
చిన వనితలు గైలాసం । బునకు నరిగి కనిరి సకలభువనాధీశున్.

147


వ॥

కని సర్వాంగీణప్రణాములై నిజగమనప్రయోజనం బెఱింగించి పరమేశ్వరాను
జ్ఞాతులై సతీదేవిం దోడ్కొని దివ్యవిమానారూఢులై మనోజవంబునం జను
దెంచి రంత.

148