పుట:కుమారసంభవము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కుమారసంభవము


క॥

పురుషాకారముఁ బటుమద । కరివదనముఁ గుబ్జపాదకరములు లంబో
దరము హరినీలవర్ణముఁ । గర మొప్పఁగఁ దాల్చి విఘ్నేశ్వరుఁ డుదయించెన్.

107


వ॥

ఇట్లు దాక్షాయణికిని సకలభువనభవనాధీశ్వరుం డైనపరమేశ్వరునకును గణా
ధీశ్వరుం డుదయించిన మహోత్సాహంబున.

108


మ॥

సురవాద్యంబులు మ్రోసె దిగ్వదనముల్ శోభిల్లె గంధర్వకి
న్నరగేయంబులు మించే దేవగణికల్ నర్తించి రింపారఁగాఁ
గురిసెం బువ్వులవాన దేవరవముల్ ఘూర్ణిల్లె నాదివ్యసిం
ధురయూధంబు మదంబు సేసె గణనాథుం రుర్వి జన్మించినన్.

109


వ॥

తదవసరంబున హరిపరమేష్ఠిపురందరాద్యఖిలదేవర్షిరాజర్షిప్రముఖాఖిలజగజ్జనం
బులు రజతాచలంబున కరుగుదెంచి మహోత్సవము సేయచుండి రంతఁ దదీయ
ప్రార్థితుండై పరమేశ్వరుండు శివగణసురగణాదిసమస్తగణాధిపత్యాఖిలక్రియారం
భాదిపత్యంబులతో యువరాజుపట్టంబు గట్టి పరమానందరసాబ్ధి నోలలాడు
చుండి రంత నక్కడ దక్షప్రజాపతి సకలజగజ్జనంబుల నిర్మించి సంతోషితహృద
యుండై యొక్కనాఁడు.

110


క॥

జలజాత్త్యంతకకశ్యప । కులభామిను లై నెగడ్తకుం జని బహుపు
త్రులఁ బడసి పేరుకొనుకూఁ । తులఁ జూడఁగ నరిగె నతికుతూహలబుద్ధిన్.

111


వ॥

చని నిజాగమనప్రయోజనంబు కశ్యపున కెఱింగించి పుచ్చిన.

112


మ॥

విని సంతోషముతోడ సంభ్రమములో వేగంబునం బ్రీతితో
మునిసందోహముతోడ శిష్యతతితో మూర్తంబు లైకొల్చువే
దనినాదంబులతోడ సంతతమహెత్సాహంబుతో వచ్చె ము
న్కొని తాత్పర్యముతోడ గశ్యపుఁడు దక్షుం గాన సద్భక్తితోన్.

113


వ॥

ఇట్లు సకళత్రంబుగాఁ జనుదెంచి సర్వాంగీణప్రణాముండై నిజమందిరంబునకుం
దోడ్కొని చని యర్ఘ్యపాద్యాదివిశేషార్చన లర్చించి మణికనకాదివస్తుని
చయంబునం బూజించినకశ్యపప్రజాపతిభక్తియుక్తి కావర్జితహృదయుండై దక్షుం
డాతని వీడ్కొని ధర్మరాజావలోకనకుతూహలపరుం డై చని ముందట.

114