పుట:కుమారసంభవము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

13


సీ॥

కడిదోవ నొడళులు గడిగి నవాశ్వత్థవల్కలరసములు వఱలఁ బూసి
భాతితో నతిమృదుధాతురాగంబులు గొమరార గుంభస్థలములఁ బూసి
సల్లలితాశోకపల్లవనివహంబు కర్ణావతంసంబుగా రచించి
మానితం బగునవమాలికాస్తబకముల్ మురజలుగాఁ గంఠముల నమర్చి
కరము వెరవు మెఱసి కరిణులుఁ దారును । నభినవంబుగా మదాంధగంధ
సింధురములు మెఱయ శృంగారములు చేసి । కామకేళి సలుపఁ గాతరిల్లె.

98


వ॥

ఇ ట్లనేకప్రకారంబుల శృంగారంబు సేసి కామకేళీలాలసులై కరికరేణువు
లత్యంతానురక్తి నొండొండ నడరం దొడంగె నంత నందు.

99


శా॥

బేటంబేటముగా నిభంబు కరిణిం బ్రేమంబుతోఁ జేరి లా
లాటం బొత్తు లలాటపట్టమునఁ గేలంగేలు వేష్టించుఁ గ్రీ
గోటన్ మేమొరయున్ వరాంగములు సోకుం బుష్కరాగ్రంబునం
దాటోపం బొనరించుఁ గూడఁ బ్రియఁ గామాసక్తి నాసక్తిమై.

100


మ॥

హృదయాహ్లాదముతోడఁ బాయక సదానేకప్రకారంబులన్
మదనాసక్తిఁ బెనంగుచున్న విలసన్మత్తేభవిక్రీడితం
బది దాక్షాయణి సూచి కౌతుకరతైకాలీనభావాభిలా
షదృగత్యుజ్వలదీధితుల్ పఱపె నీశానాననాబ్జంబుపైన్.

101


వ॥

తదవసరంబునం బరమేశ్వరుండు నిజజీవితేశ్వరిక న్నెఱింగి దానికి సమ్మతించినం
గని సంతోషించి.

102


క॥

సతి గరిణి యగుడుఁ ద్రిజగ । త్పతి గరియై కూడె సతులు భావించిన యా
కృతిఁ గూడ నేర్పగాదే । యతిశయముగ నింగితజ్ఞు లగుఫల మెందున్.

103


గీ॥

ఆదిమూర్తులు శివశక్తు లచలమతులు । హరుఁడు సతియును సురతార్థు లై విహీన
తరము లగుమృగరూపముల్ దాల్చి । రనినఁ గాముమాయల నెవ్వారు నేమిగారు.

104


క॥

హరుఁడును సతీ రతిఁ దనుపఁగ । భరమై గజకేళిఁ గూడి పడసెను సుఖ మిం
కొరు లెట్లు సేర్తు రొకమెయిఁ । గరణంబులు పెక్కులేక కాంతలఁ దనుపన్.

105


వ॥

ఇట్లు పరమేశ్వరుండును సతీదేవియు సామజకేళీలాలసులై విహరించి రంత
సద్యోగర్భంబున.

106