Jump to content

పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుక్కుటేశ్వరశతకము

పీఠిక

తిమ్మకవి కుక్కుటేశ్వరశతకము తెలుఁగుసీమలో జాలకాలముగాఁ బ్రచారములో నున్నది. ఇది వేణుగోపాల, రామలింగేశాది శతకములవలె నా కాలమునందలి సంఘదురాచారములను, ప్రభువుల యవినయప్రవర్తనలను నిర్దాక్షిణ్యముగా ఖండించుచున్నది. అట్టి శతకములను గవులు స్వానుభవమును బురస్కరించుకొని చెప్పుటచేత, నా రచనలలోని యావేగము, నావేశము, కావ్యలక్షణములనుగూడ నతిక్రమించుట సహజము. అట్టి సందర్భములలో శబ్దములు దూకుడుగా దొర్లుకొని వచ్చు ధోరణిలోఁ గవిత నడచును. జుగుప్సాంశములుకూడ కృతిముఖముగా బట్టబయలగును. అట్టివానిని పరిష్కర్తృమహాశయులు సంస్కరించి ప్రకటనార్హము చేయుటకు తంటాలు పడినను, తత్సహజస్వరూపమును కవిహృదయమును దాఁపలేక పోవుచున్నారు. ఏలాటి నిశితబుద్ధిగల పాఠకుఁడైన, నట్టి పట్టులలో “నిది కవ్యుద్దిష్ట శబ్దము కా”దని వెంటనే కనిపెట్టగలఁడు. తిమ్మకవి కుక్కుటేశ్వర శతకములోఁ గూడ నట్టి పట్టులున్నవి.

ఈ శతకమునకుఁ దిమ్మకవి తన “రుక్మిణీపరిణయము”లోనే యీ క్రింది పద్యముతో నంకురార్పణము చేసినాఁడు.

“చిన్నివెన్నెలఱేఁడు చెన్నైన సికపువ్వు, పసమించు పులితోలు పట్టుసాలు,
చిలువల యెకిమీఁడు బలు మానికపుఁ దాళి, వాటంపుఁ దెలిగిబ్బ వారువంబు,
గఱికి పూజల మెచ్చు గారాబు కొమరుండు, వలిగొండ కూతురు వలపుటింతి,
జేజే తుటుములెల్లఁ జేరి కొల్చెడు బంట్లు, నునువెండి గుబ్బలి యునికిపట్టు,
నగుచుఁ జెలువొంద, భువనంబు లనుదినంబు రమణఁ బాలించు నిన్ను నేఁ బ్రస్తుతింతు
బుధనుతవిలాస, పీఠికాపురనివాస కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!”

ఈ పద్యములోని కడపటి రెండు చరణములే కుక్కుటేశ్వరశతకమునకు మకుటమయినది. దీనినిబట్టి తన యిష్టదైవమైన కుక్కుటేశ్వరునికి తన కృతులన్నియు నంకితము చేయుటతోఁ దృప్తిపడకుండ నొక శతకమే యా దేవుని పేర వ్రాయ నెంచినాఁడనియు, దానికి రుక్మిణీపరిణయములోని పై పద్యాంత చరణద్వయమే యందమైన మకుటముగా స్వీకరించినాఁడనియుఁ దెలియుచున్నది. కాని పై పద్యములోని ‘బుధనుత’ యనునది, శతకములో “భూనుత” యని మాఱి యున్నది. ఇది యసలు కవికృతమే యయి యుండును.

ఇఁక శతకములోని విశేషములనుగూర్చి కొంచెము పరిశీలించుట యవసరము.

ఇందు పద్యములు 92 మాత్రమే. వాని వివరణము:

Ø దేవతాస్తుతి 24 పద్యములు
Ø స్వవిషయము 1 పద్యము
Ø పంచాక్షరీ మహిమ 1 పద్యము
Ø ఖల లోభులు 12 పద్యములు
Ø సుజనులు ఘనులు 6 పద్యములు