Jump to content

పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావున, తుచ్ఛభోగముల నాశించి, తన కృతులను, (అందుకొని సత్కరించు ప్రభువులుండియు) నరాంకితము చేయనొల్లక, లింగనారాధ్య గురూపదేశప్రాప్త పరమమాహేశ్వరవ్రతనిష్ఠాగరిష్ఠుఁడై, పారమార్థికబుద్ధితో జీవితము పవిత్రవంతముగాఁ గడపిన తిమ్మకవిసార్వభౌమునికి బరిహాసమున కయిన నఘ మంటఁగట్టుట మహాపచారమగును.

పదునెనిమిదవ శతాబ్దపు కవులలోఁ దిమ్మకవికిఁగల స్థానము మహోన్నతమైనది. అతని కావ్యములన్నియుఁ, దత్పూర్వకవుల మార్గములోననే నడచినను, గొన్నింటిలో నూతనత్వము లేకపోలేదు. ‘రసికజనమనోభిరామ’ రచనలోని యభూతకల్పనలు, నష్టాదశవర్ణనలు, ప్రాచీనప్రబంధముల ఫక్కిలోనే నడచినది. అంతవఱకుఁ బ్రబంధముల ధోరణులతోఁ దలవాఁచి, మొగము మొత్తిన రసికజనులకు “రసికజనమనోభిరామము” వెక్కసమయినది.

అచ్చతెలుఁగు కావ్యములను సరళశైలిలో వ్రాయుటయందుఁ దిమ్మకవి సిద్ధహస్తుడు. అందులో నతనికుండు ప్రత్యేకప్రతిభయే యాయన కవితాధార కొక విశిష్టతను జేకూర్చినది. అతనికి ముందు పదునాఱవ శతాబ్దములోని పొన్నిగంటి తెలగనార్యుఁడుకూడ నచ్చతెలుఁగులో “యయాతిచరిత్రము” వ్రాసినాఁడు. కాని తిమ్మకవి “యచ్చతెలుఁగు రామాయణ, నీలాసుందరీపరిణయము”లకు వచ్చిన ఖ్యాతి దానికి రాలేదు.

తెలుఁగువారి సంప్రదాయములను జాఱవిడువకుండ, నొడుదొడుకులు లేని కవిత్వ మచ్చతెలుఁగులో నడపి యాంధ్రప్రజానీక ప్రశంసలందుకొనిన యానాఁటి తెలుఁగుకవి తిమ్మన సర్వధా శ్లాఘ్యుఁడు; ధన్యుఁడు. అతని నిండు తెలుఁగుఁదన మతని శతకములలో బాగుగాఁ బ్రస్ఫుటమగుచున్నది.