Jump to content

పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతఁడు మహారసికుఁడు. ఇతని కావ్యములలోని శృంగారఘట్టములు రసికయౌవతయువతతుల కనురాగవర్ధనములు. కాని, దాని నాధారము చేసికొని, మనవారట్టి మహాకవుల జీవితములకుఁ గళంక మాపాదించు చిలిపికతలను గల్పించి చెప్పుట సర్వధా గర్హ్యము. అందు నీ తిమ్మకవిని గురించి యీ క్రింది కత పరంపరగా వచ్చుచున్నది:

ఇతని కావ్యములలోని శృంగారరసము నామూలాగ్రముగా గ్రహించి యానందించు విద్వత్కవయిత్రి యయిన యొక వారకాంత యతని సాహచర్యమునకుఁ దగిన యవకాశముకొఱకుఁ జూచుచుండఁగా నిర్జనమయిన యొక సందుమలుపులో నతఁ డొకనాఁడు హఠాత్తుగాఁ దటస్థపడినాఁడట! అప్పుడామె బలాత్కారముగా నతనిని గౌఁగలించుకొనినదఁట! అతఁ డట్టిసమయమున మోమావలకుఁ ద్రిప్పుకొనినాఁడట! అంతట నా గణికారత్నము-

“చతురులలోన నీవు కడుజాణవటంచును, నేను గౌఁగలించితి నిటు
మాఱుమోమిడఁగఁ జెల్లునే, యో రసికాగ్రణ్య!”

యనఁగా కవి వెంటనే

“అద్భుతమగునట్టి బంగరపుఁబొంగరపుంగవఁ బోలు నీ కుచద్వితయము
ఱొమ్ము నాఁటి యల వీపున దూసెనటంచుఁ జూచితిన్”

అని చెప్పెనఁట! ఇది కర్ణాకర్ణిగా వచ్చుచుండు కట్టుకథ యనుటకు సందియము లేదు. తిమ్మకవి రసికతాపరీక్ష కిదియా యుపాయనము? సందుమలుపా ప్రదేశము? ఎంత సిగ్గువిడిచినవారైన నిట్లు తమ గ్రుడ్డిప్రేమను బ్రదర్శింతురా? విద్యావివేకములుగల నాయికానాయకుల కిట్టి రసాభాసపు నడివీధి శృంగార మంటఁగట్టి, వారి రసికత కిది తార్కాణమని పొంగిపోవు మేధావులు కుర్కురశృంగారక్రీడాప్రశంస చేయువారికంటె భిన్నులు కారు.

కొందఱీకథను ముక్కుతిమ్మనార్యున కంటఁగట్టుచున్నారు. దీని విశ్వసించువారు, పరిస్థితులను బట్టి, అతనికే యవకాశము లెక్కువ కాన, అదియే నిశ్చయమని తలంతురు. ఆ ప్రబంధయుగమున రసికలోకవరుఁడగు ముక్కుతిమ్మన సాంగత్యము గోరు గణిక సాహసించి (తెగఁబడి) ఆ మహానగరమున నేమూలనో తారసిల్లిన ముక్కుతిమ్మన విషయమున నట్లు ప్రవర్తించెననుట సందర్భశుద్ధికి లోటు గలిగింపదు.

నేఁటి మనవారెట్టి యపదూఱులు తిమ్మకవికేకాక, శ్రీనాథునికి, ధూర్జటికిఁగూడఁ గట్టిపెట్టిరి. కారణమేమన, శృంగారము తొణికిసలాడు నూతనభావోపేతములగు నా మహాకవీంద్రుల చాటువులు, వారి కావ్యములలోని పద్యములే! కవి హృదయమును బాగుగాఁ దరచి, వారి గంభీరభావముల నర్థము చేసికొనలేని యసమర్థులయిన విమర్శకులకు “కరిసంఛాదితపంచాయుధగేహ” లనిన బమ్మెర పోతనవంటి మహాభాగవతశిఖామణికూడ విటాగ్రణియే. రంధ్రాన్వేషణపరాయణుల సంకుచితదృష్టులు వారికి సహజములు కావచ్చును. కాని యవి సంఘమున కపకీర్తికరములు; లోకమునకుఁ బ్రమాదకరములు; చారిత్రక సత్యమునకు విపత్కరములు.

ప్రకృతిసిద్ధ మానవసౌందర్యమునకు యువతులు నిధులైనందున, వారి హావభావవిలాసవిభ్రమోపేత శృంగారమును మనవారు ప్రధానముగా స్వీకరించిరి. ఆ రసపోషణ లేకుండ కృతులు రచించుటయన, వారి దృష్టిలో “నేలవిడిచి సాము చేయుట” వంటిది. ఈ విషయమునఁ గొందఱి రచనలలో నే రవంత మోతాదు మించినట్లుండినను, వారెల్లరు దుర్వర్తనులనుట సాహసమే. అది సహింపరాని నేరము.

సహజసౌందర్యలీలావిలాసముగ మోహనలగు గ్రామవనితల నిష్కళంకకోమలరూపమహిమను గుర్తింపని నాయకులు, పుట్టుసౌందర్యము వెల్లడించు నవయవసౌభాగ్యము లేని పట్టణవాసికాంతాజన కల్పితాభరణాంబరశోభలను, స్నో, ఫేస్పౌడర్, లిప్‍స్టిక్కుల రంగులను, నసహజదృగ్గమనాదుల తళుకుబెళుకులను జూచి, వారే “యందాల రాణు”లని నిర్ణయించు నీ కాలములోని మనకుఁ బ్రాచీనకవుల శృంగార మవినీతిగను, వారు “పక్కా” విటరాజులుగను గనఁబడుటలో వింత లేదు.