నీసడించువాఁడు. ఆకారణము చేతనే వారికి గ్రంథములను గృతి యీయలేదు. ఈ విషయమున నీతఁడు బమ్మెర పోతరాజునకుఁ దుల్యుఁడైనను నీయిరువురి నరాంకిత విముఖత్వములో భేదము లేకపోలేదు.
పోతన రాజులను “మనుజేశ్వరాధము” లన్నాఁడు. “సద్ద్విజశ్రేయమై” అని ద్విజులను మాత్రము “సద్ద్విజు” లన్నాడు. ఇందులోఁ గటువైన పరనింద, ఆభిజాత్యసూచకమైన యాత్మస్తుతి యున్నవి. ఇట్టి భావములు తిమ్మకవికి నున్నవి; కాని యంత పెడసరముగా (శతకములలోఁ దప్ప) నతని కృతులలో నంతగాఁ గనిపింపవు. అందుకుఁ గారణము లేకపోలేదు. వ్యవసాయము స్వయముగాఁ జేసికొనుచు బ్రతుకు నిరుపేద రైతయిన బమ్మెరపోతన, పాలకుల వలన బాధ లనుభవించినాఁడు. కవిసార్వభౌముఁ డట్లు కాక, “కందరాడ” పురాధీశుఁడై గ్రామవ్యవహారములన్నియుఁ దన యదుపులో నుంచుకొని ప్రభువుల గౌరవమును సంపాదించుకొని జీవించినాఁడు.
నరులకుఁ గృతినర్పించుటకుఁ దన యసమ్మతిని జూపిన పోతన
“హాటకగర్భురాణి నిను నాఁకటికిం గొనిపోయి, య-
ల్ల కర్ణాటకిరాటకీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ”
అని ప్రభువుల యెడలఁ దనకుఁగల ద్వేషభావమును బూర్తిగ వెల్లడించినాఁడు. తిమ్మకవి కూడ
“వినుమఖిలేశ, మర్త్యులకు వేడుకఁ గావ్యమొసంగి, ధాత్రిపై
నొనరఁగ సౌఖ్యసంపదల నుద్ధతులై సుకవీంద్రులుందురు”
అనియు,
“పనిఁబూని తుచ్ఛభోగంబునకై కొఱగాని జనులఁ బొగడుటయెల్లన్
గనుఁగొన నిహపరదూరంబని తలఁచి వినిర్మలాంతరంగుండగుచున్”
(రాజశేఖర విలాసము)
అనియు చెప్పినాఁడు. అంతియకాక తన రసికజనమనోభిరామములో
అని యన్నాఁడు. ఈ విధముగా రాజులను, వారికిఁ గవుల విషయములోఁగల యలక్ష్యభావమును, వారి త్యాగములను గూర్చి యితఁడు తన కుక్కుటేశ్వర, భర్గ శతకములలో మఱియు దీవ్రముగా విమర్శించుటతో బాటు వారి ననుసరించు పండితులనేగాక, కవులనుగూడ నిరసించి పలికినాఁడు. దానినిగూర్చి మున్ముందు మనవి చేయుదును.
తిమ్మకవి కవితను దన యనుదినారాధ్యదేవతగా భావించి, తన కృతులకన్నిటికిఁ “గుక్కుటేశ్వరు”నే పతిగాఁ జేసినాఁడు. పూర్వకవుల ప్రయోగముల నొరవడిగాఁ బెట్టుకొని శబ్దౌచిత్య మెఱిఁగి, నిరాఘాటముగా, ధారాశుద్ధితోఁ గవిత్వము సాగించు శక్తి యితనితో నంతరించినట్లు ప్రాచీనపద్య వాఙ్మయచరిత్రకారుల యభిప్రాయము. ఆనాఁటి సిద్ధహస్తులయిన కవీంద్రులలో నగ్రగణ్యుఁడైన యీ తిమ్మన తన శివలీలావిలాసములో
అని చెప్పుటవలన, నొకనాటి కిన్ని పద్యములు రచింపవలయునను నియమము నవలంబించి గంగాఝరీసరణినిఁ బురుడించు ధారలోఁ బెక్కు లాచ్ఛికమిశ్రకావ్యములు వాణికిఁ దొడవులుగా దిద్దితీర్చుచుఁ దన జీవితమును గవితాసామ్రాజ్యపాలనకే యర్పించినట్లు తోఁచుచున్నది.