అనుటచేత శుద్ధశైవమతము నవలంబించినట్లు తోఁచుచున్నది. లింగన యారాధ్యబ్రాహ్మణుఁడని పై పంక్తులే చెప్పుచున్నవి. అనఁగా లింగధారణము కలిగిన వీరశైవుఁడని వేఱ చెప్పనక్కఱలేదు కదా! అయిన నతని శిష్యుఁడగు మన తిమ్మకవి (శుద్ధ) శైవము నవలంబించి యుండవచ్చును. కాని వీరశైవాచారపరుఁడు మాత్రము కాఁడు. లింగన శిష్యత్వముచేత, నాంజనేయ వైనతేయాది భక్తస్తుత్యాదులు దగ్గినవి. కాని, త్రిమూర్తులమీఁద నతనికిఁగల భక్తి సమానమే. ఇక్కడ మఱొక విశేషము- చిన్ననాటినుండి యతని శివభక్తి యతివేలము. అందునను పీఠికాపుర కుక్కుటేశ్వరుఁ డతని యిష్టదైవము. అందుచేతనే (సర్పపురీమాహాత్మ్యము తప్ప) తన గ్రంథములన్నియుఁ గుక్కుటేశ్వరునకే యతఁ డర్పించినాఁడు.
ఇతఁడు పీఠికాపుర సంస్థానములోఁ జేరిన ‘కందరాడ’ గ్రామములో నుండువాఁడనని, సర్వలక్షణసారసంగ్రహములోను, శివలీలావిలాసములోను స్పష్టపఱచినాఁడు. కాని సారంగధరచరిత్రలో మాత్రము, తన్ను గూర్చి చెప్పుకొనుటలో “పావన కంద్రాడ పట్టణాధిపుని” యని పొగడుకొనినాఁడు. దీనినిఁబట్టి సారంగధరచరిత్ర రచనాకాలమునకు (క్రీ.శ. 1729) అతఁడా గ్రామకరణీకమును సర్వాధికారములతో ననుభవించుచుండినాఁడనుట సత్యము. అయిన, సర్వలక్షణసారసంగ్రహము వ్రాసిన క్రీ.శ. 1740 సం॥రమునకుఁ దర్వాత నా యుద్యోగమును దన తమ్ముండ్రకో, జగ్గకవి కుమారులకో యప్పగించి, సాహిత్యకవిత్వవిచారములతోఁ దాను కాలము గడపియుండును. అనఁగా నప్పటికే తిమ్మకవి వయస్సు అఱువదియవ పడిలోఁ బడియుండుట చేత “లేఖకపాఠకులు”గా జగ్గకవి కుమారుల సహాయ మపేక్షించుచు (రసికజనమనోభిరామము చూడుఁడు) నున్నవాఁడు కరణీకమును నిర్వహించుట కష్టమయి వారికే యెప్పగించినాఁడనుట సహేతుకమే. కనుక క్రీ.శ. 1729 నాఁటికి కంద్రాడ పట్టణాధిపుఁడైన తాను 1740 నాఁటికి కందరాడ మందిరుఁడైనాఁడు.
పైఁగాఁ దాను స్వతంత్రముగా వ్రాసిన కుక్కుటేశ్వర, భర్గ శతకములలో రాజులను, వారి ప్రవర్తనములను గూర్చి యుపాలంభించుటకుఁ, దన కరణీకవృత్తి ప్రతిబంధకముగా నుండునేమో యను నూహచేతఁ గూడ దానిని వదలియుండవచ్చును. పోషకులయిన పీఠికాపుర ప్రభువులను దన గ్రంథములలోఁ గాఁచిత్కముగా సూచించి తన ప్రభుభక్తిని లాంఛనప్రాయముగాఁ దెలుపుకొనెనే కాని, యే ప్రభువునకై న నొకకృతినైన నంకితము చేయలేదు. వారు నతని మహాకవిగా నంగీకరించి ‘సార్వభౌమ’ బిరుదముతో గౌరవించిరి. కాని తమ పేర కృతి రచింపవలసినదని యెప్పుడును గోరినట్లు కనఁబడదు. తిమ్మకవి జీవితములో నుండు నీ యద్భుతసన్నివేశము మఱి యే కవిజీవితములోను లేదు. “ప్రభువు - ఆశ్రితుఁడు” అను నంతస్తులలోఁగాక, స్వతంత్రవృత్తి గల పాలకపాలిత భావముతో సమానఫాయాలో పీఠపురాధీశ తిమ్మకవిసార్వభౌముల కాలము గడచినది. అవసానకాలములో నతఁడు చంద్రమపాలెము చేరినట్లు తెలియుచున్నది.
ఇతనికి “కవిసార్వభౌముఁడు” అను చినమాధవరాయ ప్రదత్తబిరుదమేకాక, “నవీనశబ్దశాసన” బిరుదముకూడ నున్నట్లు జగ్గకవి “చంద్రరేఖావిలాపము”వలనఁ దెలియుచున్నది. బహుశా యీ బిరుద మతని “సర్వలక్షణసారసంగ్రహ” రచనము తరువాత విద్యత్కోటి యనుగ్రహించి యుండవచ్చును. కాని యీ బిరుదమునుగూర్చి తాను, స్వరచిత గ్రంథములలో దేనియందును చెప్పలేదు.
తిమ్మకవిసార్వభౌముఁడు వశ్యవాక్కు. సంస్కృతాంధ్రములలో సమాన పాండిత్యము కలవాఁడు. ఆచ్ఛికశబ్దములతో నిరాఘాటముగా కవిత్వమును ‘కదం’ తొక్కింపఁగల యుద్దండుఁడు. అతని కావ్యములలో నర్థాలంకారములకంటె శబ్దాలంకారములు ప్రాధాన్యము వహించును. లక్షణానుసరణమైన కవిత్వమును సాగించుటలో శ్రీనాథుఁడు. ఆ కాలమున సంస్థానాధిపతులు, పండితులు మొదలయిన వారందఱు నతనిని గౌరవప్రపత్తులతోఁ జూచువారు. కవు లతని గ్రంథములను బ్రామాణికములుగా నంగీకరించువారు. రాజులయెడఁ దిమ్మకవి గౌరవము చూపువాఁడే; కాని వారి ప్రవర్తనల మాత్రమంతగా మెచ్చుకొనువాఁడు కాఁడు. పైగా