పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మానితానూనాసమాన నానావిధవంగత్రిలింగద్రవిడదేశభాషావిశేష భూషితాశేషకవితావిలాస భాసురాఖర్వ సర్వలక్షణసారసంగ్రహోద్దామరామాయణాది ప్రముఖబహుళప్రబంధనిబంధబంధురవిధాన నవీనశబ్దశాసనబిరుదాభిరామ తిమ్మకవిసార్వభౌమ”

(చంద్రరేఖావిలాప గద్య)

“రకపుం గావ్యకళాకలాపరచనా ప్రాగల్భ్యసంసిద్ధికై,
ప్రకటప్రేమ భజింతు నీశమకుటప్రస్ఫీతగంగాజలా-
ధికమాధుర్యాకవిత్వ ధూర్వనధియౌ దివ్యప్రభావాఢ్యుఁ ది-
మ్మకవిశ్రేష్ఠు, మదగ్రజు మదిని రామా భక్తమందారమా”

(భక్తమందారశతకము)

ఇతఁడు రుక్మిణీపరిణయములోఁ దప్పఁ దక్కిన తన యన్ని కృతులలోను “దెందులూరి లింగనారాధ్యుని” తన గురువని స్తుతించుటచేత రుక్మిణీపరిణయ రచనాకాలమునాఁటి కతనికి గురువుగారి యాశ్రయము కలుగలేదని యేర్పడుచున్నది. తద్రచనాకాలము క్రీ.శ. 1715. ఆ తరువాత క్రీ.శ. 1729 సం॥ అతఁడు సారంగధర చరిత్రలో

“శ్రీకరగుణసార చిరశుభాకార, నాకధునీజార నవసుకుమార
అలఘుతేజోనిధి యగు దెందులూరి కులు లింగనాగాధ్య గురుని నుతించి”

యనియు, భర్గశతకములో

“చిరభక్తి న్మదిలో భవద్వ్రతముగా జింతింతు నశ్రాంతమున్
బరవాదిప్రమదద్విపేంద్రపదవీపంచాననశ్రేష్ఠు బం-
ధురతేజోనిధి, దెందులూరి కులపాథోరాశి రాకానిశా-
కరునిన్ లింగయసద్గురూత్తముని భర్గా పార్వతీవల్లభా”

అనియుఁ జెప్పుటవలన దెందులూరి లింగనారాధ్య గురుత్వము 1715-1729 సంవత్సరముల మధ్య యెప్పుడో యతనికి లభ్యపడి యుండవచ్చును. ఈ గురూపదేశము పొందుటకు ముందు తిమ్మకవి, తాను రచించిన రుక్మిణీపరిణయములోఁ దక్కిన కృతులలోవలె సతీసహితముగాఁ ద్రిమూర్తులను గణాధిపుని మాత్రమే కాక, యాంజనేయ, వైనతేయ, నవగ్రహాదులనుగూడ స్తుతించుట చేత వైష్ణవపక్షపాతముగల యద్వైతిగనే కనిపించును.

నియోగులలోఁ బ్రాఙ్నాటివారనియు నార్వేలవారనియు రెండు ప్రధానశాఖలున్నవి. అందులో మొదటిది తిర్యక్పుండ్రాది శైవప్రముఖాచారముగా, రెండవది యూర్ధ్వపుండ్రాది వైష్ణవప్రసిద్ధాచారపరముగా వ్యవహరించుచుండినను రెండు నద్వైతమతమునే యవలంబించి, శాంకరగురుపీఠమునకే యంకిత మైయుండుట యందఱి కెఱుకపడిన విషయమే. ఒక్క గోల్కొండవ్యాపారిశాఖ మాత్రమే విశిష్టాద్వైతమతము నవలంబించినది. ఇఁక నార్వేలశాఖవారు శివకేశవభేదము లేని శుద్ధాద్వైతులైనను, నామములు ధరింతురు. ఈ యార్వేలశాఖవారిని గూర్చి కంకంటి పాపరాజు చెప్పిన విషయములన్నియు నక్షరముల నిజము. ఆనాఁటి కవులందఱు నూటికి డెబ్బదియైదుగురు ఆర్వేలవారే. (ఇఁక నిప్పుడున్నవారి మాటయో) - అది విషయాంతరము.

ఆర్వేలశాఖవాఁడయిన మన కూచిమంచి తిమ్మకవి యద్వైతమతావలంబకుఁడై యుండియు,