పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“రావు నీలాద్రిమాధవరాయ నృపతిచేతఁ గవిసార్వభౌమ విఖ్యాత బిరుద
మందిన ఘనుండఁ, దిమ్మయాహ్వయుఁడ”

నని చెప్పినాఁడు. దీనినిబట్టి యీ నీలాద్రిమాధవరాయనృపతి నీలాద్రిరాయణింగారి మనుమడయిన చిన్న మాధవరాయణింగారనియు, నితఁడు వేంకటకృష్ణారాయణింగారికిఁ దరువాత ననఁగా 1759లోఁ బ్రభుత్వమునకు వచ్చినాఁడనియుఁ దెలియుచున్నది. అట్టి సందర్భములోఁ, దిమ్మకవి తాను 1750లో వ్రాసిన రసికజనమనోభిరామములో 1759లో వచ్చిన ప్రభువు కవిసార్వభౌమబిరుద మిచ్చినాఁడనుట పొసఁగునా! ఏల పొసఁగదు? బిరుదమిచ్చుటకుఁ, బరిపాలనము సేయు రాజే యయి యుండవలయునను సిద్ధాంత మెక్కడను లేదుకదా! యువరాజై న నందుల కర్హుఁడే కదా! తిరుపతి వేంకటకవులు వేంకటగిరిసంస్థానమునకు వెడలినప్పుడు ముందుగా సత్కరింపఁబడినది, యప్పటి యేలికయగు శ్రీరాజగోపాలకృష్ణయాచేంద్రులవారివలన కాదనియు, వారి సోదరులగు ముద్దుకృష్ణయాచేంద్రులవారిచేత గౌరవింపఁబడిరనియు వారి ‘నానారాజసందర్శనము’ వలనఁ దెలియుచున్నది. కనుక చినమాధవరాయణింగారివలన తిమ్మకవియు బిరుదము పొంది యుండుటలో నసంభవ మేమియు లేదు. (ఏలిక కాకున్నను) యువరాజైనవానికి నంతమాత్ర మధికారముండి యుండుననుట బేసబబు కాదు.

తిమ్మకవియెడల (అతని కాలమునకు) సంస్థానాధిపతులయిన దొరలకెల్ల సమానగౌరవప్రతిపత్తు లున్న ట్లతని రచనలన్నిట వారిని బేర్కొనుటచేతనే సూచితమగుచున్నది. తన రుక్మిణీపరిణయములో పెద్దమాధవరాయణింగారిని, సారంగధర చరిత్రలో వేంకటకృష్ణారాయణింగారిని, రసికజనమనోభిరామములో నీలాద్రి (చిన్న) మాధవరాయణింగారిని పేర్కొన్నాఁడు. ఈ ముగ్గురిలోను మొదటి యిద్దఱకంటె మూఁడవవారే యెక్కువ రసికులుగను, నెక్కువ సన్నిహితులుగను నుండి, కవిగారి నాదరించి, సత్కరించి, బిరుదమిచ్చి యుందురనుటలో సందేహము లేదు. పైగా నీ ప్రభునియొక్కయుఁ, గవిసార్వభౌముని యొక్కయు వయస్సులలో నట్టే తేడా కనబడుట లేదు. సమకాలికులు, సరసులయిన వీరిరువురి సమకాలికత్వము ప్రభువు సాహిత్యపోషణకును, కవియొక్క కవితాప్రతిభాప్రకటనకును తగిన యవకాశము కలిగించినది. కనుకనే, కవి యందలి తన గౌరవమును సూచించుటకు చినమాధవరావు “సార్వభౌమ” బిరుద మతని కనుగ్రహించినాఁడు.

తిమ్మకవి తన కులగోత్రాదికములనుగూర్చి తన కృతులలో వివరముగా వ్రాసికొనినాఁడు-

ఇతఁ డాఱువేల నియోగి బ్రాహ్మణుఁడు. కౌండిన్యసగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. లచ్చమ గంగనల జ్యేష్ఠపుత్రుఁడు. ఇతని తాత కూడ తిమ్మన నామాంకితుఁడే. ముత్తాత బయ్యన. జగ్గన్న, సింగన్న, నరసన్న లితని పినతండ్రులు. వీరమ్మ, పాపమ్మలు మేనత్తలు. సింగన్న, జగ్గన్న (జగన్నాథకవి), సూరన్నలు తమ్ములు. ఇతని సతీతిలకము గొట్టుముక్కుల రామయమంత్రి కూతురైన బుచ్చమాంబ.

తిమ్మకవి తన రసికజనమనోభిరామములో

“నిఖిలవిద్యాభ్యాసనిపుణుఁడు మత్సహోదరుఁడగు జగ్గసత్కవితనయులు
ఘనులు తిమ్మనయు, సింగనయును లేఖకపాఠకులై కృతుల్ ప్రబలఁ జేయ”

అని చెప్పుకొనుట చేత నితనికి సంతానము లేదని యూహింపవలసియున్నది. జగ్గన్న కుమారులను మాత్రమే పేర్కొనుట చేతఁ దక్కిన యిద్దఱికిఁ గూడ నప్పటివఱకు బిడ్డలు లేరనియే తోఁచుచున్నది. తిమ్మకవిమీఁద నతని తమ్ములకుఁ, దమ్ముని కుమారులకు నమితగౌరవమున్నట్లు తెలియుచున్నది. జగ్గకవి యితనినిగూర్చి తన కృతులలోఁ బ్రశంసించిన యీ క్రింది వాక్యములవలన నది రుజువగుచున్నది.