Jump to content

పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Ø సుకవి కుకవులు 4 పద్యములు
Ø సుశీలా దుశ్శీలలు 5 పద్యములు
Ø పామరజనులు 10 పద్యములు
Ø కలిమిలేములు 2 పద్యములు
Ø సత్ప్రభు దుష్ప్రభులు 2 పద్యములు
Ø దాతలు సప్తసంతానములు 2 పద్యములు
Ø సామాన్య నీతులు 12 పద్యములు
Ø కలికాల మహిమ 2 పద్యములు

ఈ విషయవిభాగములవలన, కవి యప్పటి సాంఘిక పరిస్థితుల నన్నింటిని సులభముగా నవగాహనము చేసికొని పాఠకుల కన్నులకు కట్టిన ట్లెట్టయెదుట ప్రత్యక్షము చేసినట్లు గోచరించుచున్నది..

ఇందులోఁ గల తెలుఁగునాటి దైనందిన వ్యావహారిక శబ్దములు నుపమానములు-

ముకుదాడు, బొల్యావు, పోట్లావు, ఎగదొబ్బు, తిండిపోతు, కక్కూర్తి, గొగ్గిపుట్టు, గగ్గెర్లు, గాజుపూస, నల్లబొట్టు, సుద్దపల్లె, తిర్నామాలు, పరగళ్లు, కుంటెనలు.

అద్భుతజాతీయములకు, నానుడులకు నీ శతకము నిధివంటిది.

(1) కడుగైన తవుడైన, (2) మాడైన మక్కైన, (3) తప్పుదండుగలు, (4) గొల్లసుద్దులు, (5) బాపన పిసాసులు, (6) నాబంటుకొడుకు, (7) ఎగరాసి దిగరాసి, (8) కాయకసరైన, (9) సల్లమ్మి సవకమ్మి, (10) తమలంబు తుక్కు, (11) పల్లకికుక్కి, (12) పటాపంచలు, (13) సందడి తీర్చు, (14) కీల్గంటు పువ్వు, (15) సానకింది వన్నె, (16) జగడాల చీలి, (17) వేసాల వెల్లి, (18) చెరపన చేట.

లోకోక్తులు, ఉపమానములు నుక్తవిషయముల కలికినట్లు కూర్చుటలో నీ శతకకారుఁడు కడుంగడు దిట్ట. కొన్ని యీ క్రింద కాననగును:

(1) పాడింట ఇడిన దీపము, (2) షండున కబ్బిన చాన, (3) కోతి కొదవిన కొబ్బరికాయ, (4) రాతిని నార దీయవచ్చు, (5) గాలిపోగిడి మూటగట్టుట, (6) కోతికి బంగారు గొలుసు, (7) జొన్నఁబడు గ్రుడ్డియెద్దు, (8) కయ్యంబునకు కాలుదువ్వు, (9) మంగలి చేతి దర్పణములు, (10) తృణహుతాశనములు, (11) తలకొట్లఁ బడుట, (12) కొండతో తగరు డీకొనుట.

ఇవిగాక, (1) రాజ్యాంతే నరకం ధ్రువమ్, (2) జాతస్య మరణం ధ్రువమ్, అను నార్యవచనములు నటనటఁ గాన్పించుచున్నవి.

సంస్కృత గ్రంథములలోని భావములుగూడ నీ శతకములో నక్కడక్కడ నగపడుచున్నవి:

“అంబోధి కభిషేక మాచరించిన యట్లు, గంగకుఁ బాద్య మొసంగినట్లు,
మేరువునకు నలంకారంబు లిడినట్టు, లినునకు నారతులెత్తినట్లు,
మలయాచలమునకు గలప మిచ్చినయట్లు ఇల వసంతునకుఁ బూ విడినయట్లు
భూపముఖ్యునకుఁ దాంబూల మిచ్చినయట్లు సోమున కద్దంబు సూపినట్లు
నిఖిలలోకైకభర్తకు నీకు నొక్క బిల్వదళ మార్యవర్యు లర్పించుచుంద్రు”