పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

88


సీ.

నోరు చేఁదై కూడుగూరలు చవి దప్పు
                   గడగడ నొడలెల్ల వడకుచుండు
జెవుడున నేమియుఁ జెవులకు వినరాదు
                   తెగులును జింతయుఁ దగులుకొనుచు
కన్నులఁ బొర గప్పి కానరాదెద్దియు
                   సిగ్గొకించుకయైనఁ జేరఁబోదు
బాలు రందఱుఁ గూడి గేలి గావింతురు
                   మగువలు పకపక నగుచునుంద్రు


తే.

మదిఁ దలంపగఁ గటకటా ముదిమియంత
రోఁత లేదు గదా ధారుణీతలమున,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

89


సీ.

బావిలోపలఁ బడ్డ పామును వెడలింపఁ
                   జనువానిఁ గరువక చనఁగఁగలదె
చిచ్చులోఁ బడెడు వృశ్చికమును వెడలింపఁ
                   జనువాని మీటక నడలఁగలదె
పెనువెల్లిఁ బడి పోవు బెబ్బులిఁ బరికింపఁ
                   జనువాని మ్రింగక మనుపఁగలదె
బురదగోఁతను బడ్డ పోట్లావు లెగనెత్తఁ
                   జనువాని బొడువక జరగఁగలదె


తే.

అవనిలోపల ఖలుని నెయ్యంబు మీఱ
మనుపఁ జనువానిఁ జెఱుపక మానఁగలఁడె?
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

90