పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

55


సీ.

భోగియై ప్రతిదినత్యాగియై పుణ్యసం
                   యోగియై సుజనానురాగి యగుచు
దాతయై బుధజనత్రాతయై నిఖిలవి
                   జ్ఞాతయై కుశలసంధాత యగుచు
ధీరుఁడై రణరంగవీరుఁడై నిర్మలా
                   చారుఁడై నిరుపమోదారుఁ డగుచు
శాంతుఁడై సదమలస్వాంతుఁడై కీర్తిది
                   గంతుఁడై పటుబలవంతుఁ డగుచు


తే.

రాజ్యమేలంగఁ గలవాఁడె రాజు గాక
హీనమతియై చరించువాఁ డేటి రాజు?
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

56


సీ.

ఘూకంబు తెఱఁగున గొందుల నిరుకుచు
                   భుజగంబు చాడ్పున బుస్సుమనుచు
బెబ్బులి కరణిఁ గంపిల డాక సేయుచు
                   భేకంబు గతి మేనిబెంపు గనుచు
భల్లూకమట్లు చొప్పడ విఱ్ఱవీఁగుచు
                   నాఁబోతు కైవడి నాముకొనుచు
గోమాయువట్ల యెన్నోమాయ లూనుచుఁ
                   గ్రోడంబువలెఁ గొరకొర నెగపుచు


తే.

దనరు క్రూరనృపాలకాధముల నమ్మి
సిరుల కాసించువాఁ డొక్క చెనఁటికాఁడె
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

57