పుట:కాశీమజిలీకథలు -09.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

యున్నది. ఉత్తమ మంత్రిపుత్రునికన్న రాజపుత్రునితో సహవాసిఁగను సహాధ్యాయునిగను జేయుటకు గౌరవనీయుఁడగు మరియొక బాలుఁడు దొరకుట దుర్ఘటము శిశుక్రీడల సహవాసము నాఁటినుండియుఁ గలిసినమైత్రియుఁ బ్రేమయు ననురాగము నిర్యాజముగ నవిచ్చిన్నముగ నుండకపోవదు. ఇంద్రమిత్రుని ప్రధానమంత్రి గుణనిధియనుబ్రాహ్మణుడు. అతని పుత్రుడు సిద్ధార్థుఁడు. సిద్ధార్థుఁడు రాజపుత్రు నంతటి చక్కనివాఁడు కాకపోయినను సామాన్య రూపవంతులలో నుత్తముఁడని చెప్పదగినది. ప్రాయము చేతనే కాక బుద్ధివిశేషముచేత నిరువురు సమానులని పేర్పొందిరి. పెక్కేల పాంసుక్రీడలు మొదలు విద్యాభ్యాసాంతము వఱకు వారిద్దరికి నొక్కచోటనే భోజనము, ఒక్కచోటనే శయనము, ఒక్కవిధమే యలంకారము, ఒక్కవిధమే గౌరవము, వారిద్దరికి నొక్కటియే ప్రాణము, విద్యాభ్యాసము సమానముగా జరిగినది. సిద్ధార్థుని బుద్ధిబలము, రాజపుత్రుని భుజబలము విశేషించి జను లద్భుదముగాఁ జెప్పుకొనుచుండిరి. గురువుల నడిగిన శంకలకు వారు సమాధానము సెప్పలేనప్పుడు తమరే వితర్కించి సదుత్తరము లిచ్చి మెప్పించుచుందురు.

ఒక వసంతకాలమునఁ బ్రొద్దు గ్రుంకిన రెండు ఘడియలకు వారిద్దరు నొక యుప్పరిగపై వసించి మలయమారుతపోతములు మేనికి హాయిసేయఁ బండువెన్నెల సేవింపుచుండి రందు రాజపుత్రుఁ డాకసము వంకఁ జూచుచు మంత్రిపుత్రున కిట్లనియె.

వయస్యా! నీలంపు పట్టుపుట్టంబునం గట్టఁబడిన వితానంబును బోలె డంబు మీరియున్న మున్నునం గూర్చిన వజ్రంపురవ్వలవలెఁ జుక్క లక్కజమగు తేజంబున ప్రకాశింపుచున్నవి. చూచితివా? ఆహా! సూర్యచంద్రనక్షత్రాదుల ప్రచారములే భగవంతుని ప్రభావమును జాటుచున్నవి. అయ్యారే! సూర్యుఁ డెందు నిలిచి యెందుండి యెందు బోవుచున్నవాఁడో చంద్రునిగతి యెట్టిదో, నక్షత్రప్రచారము లెట్టివో, చూచిన వాఁడెవ్వఁడును లేఁడు. సూర్యకాంతియే చంద్రునియందును నక్షత్రములయందునుఁ ప్రకాశింపఁజేయునని చెప్పుదురు. సిద్దాంతశాస్త్రకర్తలు చిరకాల మాకసమువంక బరీక్షించి గ్రహనక్షత్రాదులగతులు చూచి చూచి గ్రంథములు వ్రాసిరి కాని యక్కడికిఁ బోయి చూచి వ్రాసిన విషయములు కావు. ఔరా! అన్నియు గనంబడుచున్నవి, నడుచుచున్నవి. అవి యేవియో తెలియవు. అవి లేకున్న మనము క్షణము జీవింపజాలము. అని చెప్పుకొనుచుండఁగనే వారికడకు సిద్ధాంతదేశికుం డరుదెంచెను. వారిద్దరు దిగ్గునలేచి నమస్కరింపుచు సుఖాసీనుం గావించి వారును పీఠము లలంకరించిరి. అప్పుడు వారికి గురుఁడు గ్రహనక్షత్రాదులకుఁ గల సంబంధములు గమనములు స్వరూపములు లోనగు విశేషములన్నియు నెఱింగించెను. అప్పుడు రాజకుమారుం డా యాచార్యున కిట్లనియె.

రాజ - ఆర్యా! సూర్యుఁడు చంద్రుఁడు నక్షత్రము లనఁగ నెట్లుండును,