పుట:కాశీమజిలీకథలు -09.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

క. వనచరులై తగు మీకీ
   మనసిజ మహానీయ శాస్త్రమర్మక్రియ లె
   ట్లనువడియె ననుచు సఖి దం
   తనఖాంకంబులను బ్రకటితము జేసి నగన్.

శా. సూనాస్త్రక్రియ లెట్టివో యెఱుగనేచోద్యంబునుంగాన మిం
    తీ! నీ చెంతకు రాకమున్ను భవదంతేవాసినై సత్కళా
    స్థానాస్థానవివేకకౌశలమనీషాప్రౌఢిమ న్నేర్చితి
    న్గానం గారణ మీవె యిందులకు గాంతారస్థు లింపొందగన్.

అని యతండు సమాధానము జైప్పుచుండెను.

క. తెల తెల వారె బళాబళ!
   కిల కిల మీరిటుల నర్మకేళీలోల
   స్థలదుక్తుల నాడుకొనం
   జెలు లితరులు వినిన గేలిసేయరె తరుణీ!

అని పలుకుచు నశోకవతి తలుపు గొట్టుటయు దత్కంఠ ధ్వని తెలిసికొని కల్పలత యత్యంతోత్కంఠతో -

సీ. తాంబూలరాగారుణం బోష్టమున బొల్చు
              రదనాంకములు రతిప్రౌఢి దెలుప
    ఫాలకంఠకపోలభాగస్త మణివిందు
              మాలలు పతికళామహిమ బొగడ
    తెలసోగకన్నుల వెలయుకెంపు త్రిరాత్ర
              జాగరణత్వ దీక్షను వచింప
    నలిగిన మేని భూషల విలాసములంగ
             పరివర్తనక్రియాపటిమజాట
గీ. విడిన నెఱికుఱు లొకచేత ముడిచికొనుచు
    జిక్కువడినట్టి పేరుల జేర్చికొనుచు
    బ్రిదురు కుచ్చెళులను సవరించుకొనుచు
    దలుపుతీసె లతాంగి యీవలకు వచ్చి.

ఎదుర నశోకవతింగాంచి కల్పలత బిగ్గర గౌగలించుకొని సఖీ! ఎన్నిదినంబులకు గనంబడితివి? ఎందెందు దిరిగితివి? ఎప్పుడు వచ్చితివి? రాజవాహనుని నేమిజేసితివని యడిగిన నవ్వుచు నా జవరాలు చాలు చాలు. నీ టక్కులు నే నెఱుంగ ననుకొంటివా! రాజవాహను డెందుండెనో నీ కపోలంబునం గల గంటుల నడుగుము. వాల్గంటీ? నిషాదకుల సంజాతుడని పరిహసించితివిగదా? ఎట్లంగీకరించితివి?