పుట:కాశీమజిలీకథలు -09.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయంతుని కథ

95

అని పరిహాస మాడుచుండ రెండుచేతులు జోడించి యిట్లనియె. ప్రియసఖి! నీ వేమి యాక్షేపించినను నేను బ్రత్యుత్తర మీయను. నీ సంకల్పము భగవత్సంకల్పమైనది. అతని చరిత్రము వినిన నీవు మిక్కిలి వెఱగుపడుదువు. పక్షులు రెండును గలసికొనినవి. వానియుదంత మంతయు నెరింగిచినవి. అని దానిచేయి పట్టుకొని యుద్యానవనములోనున్న గున్నమామిడిక్రిందనున్న రత్నవేదికయొద్దకు దీసికొనిపోయి యందు గూర్చుండబెట్టి పక్షులవలన దాను వినిన వృత్తాంతమంతయు నెఱుంగజెప్పినది.

ఆ కథ విని యశోకవతి యోహోహో! ఏమి నీ యదృష్టము? భూలోకవనితాదుర్లభుండైన మనోహరుం బడసితివి. సాథు! సాథు! ఇక భూధవున కెరింగింపవచ్చునని మెచ్చుకొనుచు మఱియు నిట్లనియె తరుణీ! మఱియొక్కటి వినుము. వీనివార లక్కడ జిక్కుపడి యున్నారు. జననీముఖంబుగా నీ సంబంధము మీ తండ్రి కెఱింగించి తగుబలంబుల సహాయ మిచ్చి వీని నిప్పు డా జయపురంబున కనుపవలయును. ఇతం డశ్రమంబున శత్రువుల బరాభవింపగలడని యక్కడి కథ లెల్ల దెల్పినది.

నీవే పోయి మా తల్లితో జెప్పి యా సంఘటనమంతయు గావింపుమని కల్పలత అశోకవతినే నియమించినది. అశోకవతి యప్పుడే రాజపత్ని యొద్ద కరుగుటయు నామె అశోకవతితో నీవుగూడ బొత్తుగ నిందు వచ్చుట మానివేసితివేమి? నీ సఖురా లట్లు పిట్టలం బెట్టుకొని ముచ్చటించుచు నెంత కాలము బెండ్లియాడకుండ గాలక్షేపము జేయును? పెండ్లిమాట యెప్పుడైన దలపెట్టునా? అని యడిగిన నశోకవతి అమ్మా! తగిన వరుని నిమిత్త మింతకాల ముపేక్ష జేసినది. పెండ్లియాడ కేమిచేయును? గారణము నీ యుపదేశమే కాబోలు తగినవరుడన నెట్టివాడు. స్వర్గము నుండి మహేంద్రుని కుమారుడు జయంతుడు దీనికొరకు వచ్చునాయేమి? ఉన్న వారిలో మంచివాని నేరుకొనవలయునని పలికిన విని యక్కలికి అమ్మా! నీవు సత్యవచనవు. అకారణముగా నీ నోటినుండి నిజము బయలువెడలినది. నీ వనినట్లు జయంతుడే యామె వరింపవచ్చెను. అతనినే యామెను వరించినది ఇక నిక్కము దాప నేల? గాంధర్వ విధానంబున వారు గలసికొనిరి.

అని యెఱింగించినంత నక్కాంతారత్నంబు ఏమంటివి ? మఱలజెప్పుము. నీవన్న మాట పరిహాస కల్పితమా? సత్యమా? అని వెఱగుపాటుతో నడిగిన నిజమే యని యది సమాధానము జెప్పినది.

ఛీ, ఛీ, అపాత్రురాలవు. నీ సహవాసంబున నది చెడిబోవుచున్నది. వారెవ్వరో నిజము చెప్పుము. స్త్రీలకు బుద్ధిస్థైర్యముండదు. ఉండియుండి చివరకు యపాత్రులను స్వీకరింతురు. వాడు నాయెలనాగ పాత్రుడో యపాత్రుడో నీవు వచ్చి చూడుము. నీకే తెలియగలదు. అని యామెతో బెద్దగా వాదించినది.

రాజపత్ని పెద్దవారలకు దెలియకుండ మీ రిట్టి యపఖ్యాతి పనులం గావిం