పుట:కాశీమజిలీకథలు -09.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నెత్తివేసి వాని బిరుదములన్నియు లాగికొని యంపివేసితిని అప్పుడు ఱేఁడు నన్నుఁ బెద్దగా గౌరవించి పచ్చల పతక మొకఁటి నాకు గానుక నిచ్చెను.

ఆ రాజునకు వసంతమాలయను కూఁతురు గలఁదు. ఆ చిన్నది యంతఃపురమునుండి మా మల్లయుద్ధ మంతయుం జూచినది. పుష్పనారాచుని బారింబడిన డెందముతో మరునాఁ డొకయుత్తరము వ్రాసి పరిచారిక చేతికిచ్చి యనిపినది. అందు—-

అభినవప్రద్యుమ్నా! కందర్పుండు సౌందర్యంబున నిన్నుఁ బోలునేమో కాని నిర్వక్రవిక్రమంబున నీకు సాటిరాడు. మొన్నటి మల్ల యుద్ధంబున నీరూపము నీపరాక్రమము చూచితిని. అప్పటినుండియు నాడెందము నీయందు లగ్నమయినది . నీవే నాకు భర్తవు. నాకోరిక దెలిపినను నన్ను మా తలిదండ్రులు నీకిచ్చుట కంగీకరింపరు. ఎల్లుండి యర్థరాత్రంబున నీవు నగరాంతమున నున్న కాళికాలయము దాపున నుండవలయు. అశ్వంబెక్కి నేఁనచటికి వచ్చెదను. కలసి విదేశమేగి సుఖింతముగాక! అందులకు నీ వంగీకరింపవేని రజ్జుపాషాణవిషాదులచే మేను విడచుదాన.

ఇట్లు మీ పాదసేవకురాలు.

వసంతమాల.

ఆ పత్రికంజదువికొని నేనొక్కింతసేపు స్త్రీ సాహసమును గుఱించి వితర్కించుచు యౌవనమదావేశంబున నది నిషేధమని తలంపక యంగీకారసూచనముగాఁ బ్రత్యుత్తరము వ్రాసి యంపితిని. ఇంతకును భవితవ్యత యిట్లుండ నెవ్వరు దప్పింపగలరు? నేనును దలిదండ్రులకుఁ దెలియకుండ వస్తువాహనముల సవరించుకొని నాఁటి యర్థరాత్రమున కాయమ్మవారి గుడియొద్ద గుఱ్ఱమెక్కి పోయి యాయింతిరాక నరయు చుంటిని. అంతలో నాకాంతారత్నంబు నీలపటావ కుంఠనముతో నశ్వారూఢయై నేనున్న తావునకు వచ్చినది. గుఱ్ఱముడెక్కల చప్పుడు విని నేనామె దాపునకు నాగుఱ్ఱమును బోనిచ్చితిని.

ఆమె యేదియో గీచినంత నొక ప్రభ తళుక్కున మెరసినది. ఆవెలుఁగున నా మొగము జూచి యాచకోరనయన సంతస మభినయించుచు బదఁడు మీగుఱ్ఱమును ముందు నడిపించుఁడని పలికింది. అప్పుడు నేనొక మార్గంబునఁ దురగమును బోనిచ్చుటయు నాప్రక్క నక్కలికియు దనగుఱ్ఱమును జేర్చి నడిపించుచుండెను. దాని నే నెరిగిన దగట ఘోటకముల వేగముగా నడిపించితిమి. నేనెంత వేగముగా దోలిన నాలలనయు నంతవేగముగా నడిపించుచుండెను.

తెల్లవారువరకుఁ చాలదూరము పోయితిమి. ఒక తటాకము కడ గుఱ్ఱముల దిగితిమి. కాలక్రమనేమంబులం దీర్చుకొనివేళల అవనతవదనయై యాచంద్రవదవ మఱేమియి మాటాడక మారని వేచుచుండెను. వెండియు మేము గుఱ్ఱము లెక్కఁబోవునంతలో నాప్రాంతమందుండి యొకకోఁతి నాముందు నిలువంబడి యెక్కడికో