పుట:కాశీమజిలీకథలు -09.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రవర్మ కథ

79

బ్రవేశపెట్టెను. అతం డందుఁ బ్రవేశించి తదీయ రామణీయకమున కచ్చెరువందుచు నోహో! యీ కిరాతపతి యైశ్వర్యము మహారాజు మించియున్నది. వీని మాటలయందు వనేచరత్వ మేమియు గనంబడదు. శుద్ద శ్రోత్రియుండువలె, మహా విద్వాంసుఁడువలె సంభాషించుచున్నాఁడు. వీని చరిత్ర మెట్టిదో తెలిసికొనవలసియున్నదని యాలోచింపుచుండ నాభిల్లపతి యతని నికటమున కరుదెంచుటయు సముచిత సత్కారములు గావించి విజయపాలుం డిట్లనియె.

శబరేంద్ర! నాకు నిన్నుఁ జూచినది గోలెఁ గడుసంతసము విస్మయము గలుగుచున్నది. మృగప్రాయులగు వనచరులయందుఁ పెద్దపులులకువోలెఁ బౌరుషముండిన నుండవచ్చును. కాని యిట్టి వినయసంపత్తి, విద్యాగౌరవము, సంభాషణచాతుర్యము మొదలగు నుత్తమగుణంబులు మీకెట్లు కలిగినవియో తలంప విచిత్రముగా నున్నది. నేను రాజ్యభ్రష్టుండనై యడవుల పాల్పడి మతిచెడి తిరుగుచుండ భగవంతుఁడు నీ పుత్రికారూపంబున వచ్చి నీయండ జూపించె. నీ వాపద్బంధుండవై నన్ను మన్నింపుచుంటివి. ఇట్టి సుగుణసంపత్తిఁగల నీ చరిత్రము వినఁ బాత్రుండనేని యెఱింగించి శ్రోత్రానంద మాపాదింపుము మీయందు వనచరధర్మములేమియుఁ గనంబడవు.

అని యడిగిన నన్నిషాదాధిపతి సాదరముగా నిట్లనియె. మహారాజాఁ నాయుదంత మింతదనుక గోప్యముగానే యుంచితిని. నిన్నుఁజూడఁ జెప్పవలయునని బుద్ధిపుట్టుచున్నది. యాకర్ణింపుము.

చంద్రవర్మ కథ

నేను దక్షిణదేశమున మధురాపురంబున క్షీరస్వామి యను బ్రాహ్మణునికిఁ బుత్రుఁడనై పుట్టితిని. నాపేరు చంద్రవర్మ యండ్రు. మాతండ్రి నన్ను యుక్తకాలంబున నుపనీతుం జేసి బ్రాహ్మణకులోచితములైన విద్యలం గఱపుచుండెను. నాకుఁ గులవిద్యకన్న విలువిద్యయం దభినివేశ మెక్కుడుగాఁ గలిగినది. మల్లయుద్ధములో నన్ను మించువాఁడు లేకపోయెను. గుఱ్ఱపుపందెములలో నేను మొదటివాఁడనై పతకమును సంపాదించుకొంటి. నా వృత్తాంతము విని పాండ్యమహారాజు నన్నుఁ బిలిపించి నెలకు నూరుమాడలు వేతనమిచ్చి తన కొలువు సేయించుకొనుచుండెను. నేను యౌవనమున మిక్కిలి రూపవంతుడఁనని చెప్పుట స్వాతిశయోక్తిగా నుండును.

మా సంస్థానమున కెక్కడనుండియో భీమునివంటి మల్లుఁ డొకఁడు వచ్చి రాజదర్శనము జేసి తనబిరుదములన్నియుఁ జూపి గండపెండేర మిమ్మని కోరెను. మహారా జందుల కియ్యకొనక నన్ను వానితోఁ బోరుటకు నియమించెను. మామల్లయుద్ధము నగరిలో శుద్ధాంతప్రాంతోద్యానవనంబునం జరిగినది. నేను వాని నవలీల