పుట:కాశీమజిలీకథలు -09.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

వచన సుధారసధారలు శ్రుతులం గ్రోలుటచే మదీయహృదయసంతాపము కొంతసేపు మరచితిని. నా వృత్తాంతము వినిన నీకునుం జింత గలుగక మానదు. అయిననుం జెప్పెద వినుము.

నేను విజయపుర నగరాధీశ్వరుఁడ. నా పేరు విజయపాలుడందురు. నేను న్యాయంబుగనే ప్రజలం బాలింపుచుంటిని. సుమతి యను మంత్రిపుంగవు నన్యాయముగఁ బరాభవించితిని. ఆ దోషంబున రాజ్యభ్రష్టుండనై యడవులంబడి తిరుగుచుంటి. నేను మహాపాపాత్ముండ. నాకు మరణమే శరణమని తనయుదంత మంతయుం జెప్పి పరితపించెను.

అప్పు డాసుందరి యశ్రుబిందువులు కన్నులు రాల విచారించుచు మహారాజా! గొప్పవారలకే యాపదలు. నల హరిశ్చంద్రాదులు పడిన యిడుములు వినియుండలేదా? ఆపదలు కాపురములు సేయవని యాకాశవాణియే మి మ్మోదార్చినది గదా! మీరు మా గ్రామంబునకు రండు. మా తలిదండ్రులు వృద్ధులై యున్నారు. వారికి నేనొక్కరిత కూఁతురను మీరందుండి సుఖముగాఁ గాలక్షేపము సేయవచ్చును. అని యేమేమో చెప్పినది.

ఆ చిన్నది మాట్లాడుచుండ దనవృత్తాంతమంతము మరచి యతండు ప్రహర్షముతో నాలించెను. మోహాంకురము హృదయంబునం నొడసూప నా చపలనేత్రను సవిలాసముగా జూచుచుండెను. మఱియు బాలా! నీవు కిరాతకులసంజాతనని చెప్పుచుంటివి. నా కేమియు నమ్మకము తోచదు. చిలుకయుం గోకిలయుంగాక కాకి సరసముగా బలుకఁగలదా! నీ మాటలు విన విద్వాంసురాలివలెఁ గనంబడుచుంటివి. ఈ యడవిలో నీకు విద్యలెవ్వరు నేర్పిరి? ఏమి జదివితివి? అని యడిగిన నయ్యువతి మహారాజా! మీరు మిగుల బడలికఁ జెందియుంటిరి. మాయింటికి వచ్చినతరువాత నన్నియుం జెప్పెద. మీ కొఱకొక తురగమును దెప్పించెద రండు అని పలుకుచుఁ బరిచారకు నొకనిఁ బంపి యొకగిరి కూటమునుండి ఘోటమును తెప్పించినది. ఇరువురు తురగము లెక్కి శబరులు పరివేష్టించి రా నుత్తరాభిముఖులై యరిగిరి. నడచునప్పుడు ధేనుక తన గుఱ్ఱము నతనిగుఱ్ఱమున కెడమప్రక్క నడిపించుచుండుటజూచి యారాజు తదాశ్రయము గ్రహించి పంచశరవిద్దహృదయుండై సరససల్లాపము లాడుచుండెను.

అతండు గుఱ్ఱ మెట్లు నడిపింప నాయువతియు నట్లు నడిపించును. విచిత్ర గమనంబులఁ దమతమ తురంగారోహణపాటవ మొండొరుల కెఱింగించుచుఁ గ్రమంబునం బోయి నాఁటిసాయంకాలమున కా పుళిందపురిఁ జేరిరి.

పుత్రికచే విజయపాలుని చారిత్రము విని కిరాతపతి యతిసంతోషముతో నతని కతిథిసత్కారములు గావించి యెక్కుడుగా గౌరవించెను. మఱియు గజదంత వినిర్మిత ద్వార కవాటకుడ్యంబై, విచిత్రమృదుమృగచర్మ నిర్మిత సమచ్చాదనంబై, మృగమదామోదమేదురంబై యొప్పు నొకమందిరం బతనికి విడిదిగా నిచ్చి యందుఁ