పుట:కాశీమజిలీకథలు -09.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

చూచుచున్న సమయంబున నందుఁ దపంబుసేసికొనుచున్న యొకసిద్ధుం డతనియుద్యమంబు గ్రహించి.

క. వలదు వల దుడుగుమీ నృప
    బలవన్మరణంబు మిగుల పాతక మని పె
    ద్దలు సెప్పఁగ వినవో య
    వ్వలి పుట్టుక బ్రహ్మ దానవత్వము గలుగున్.

గీ. ఏమి వచ్చె నీకు నిట్టు లూరక మేను
    విడువ నిన్నుఁజూడక విభుఁడవట్లు
    కానుపింతు కొంత కాలంబునకు నైన
    బ్రతికి యున్న సుఖము బడయరాదో.

అట్టి మాటలు విని యా నృపాలుండు నలుమూలలు చూచియెవ్వరింగానక యది యాకాశోక్తిగాఁ దలఁచి యా యుద్యమంబు మాని పర్వతము దిగినడుచువాఁడు. ముందట.

క. గురుతర కంటకవల్లీ
    పరివృతమై సింహ శరభ భల్లుక హరి సూ
    కర శార్దూలాది భయం
    కర మృగతతి వితరమైన కానన మెదుటన్ .

కనుంగొని యించుకయైన మనంబున వెఱవక యొక తెరవునం బడి నడచుచుఁ గ్రూరసత్వంబుల యార్పులు విని భయపడక యెదురైన శార్దూలాది క్రూరసత్వంబుల నదలించుచుఁ బోయి మధ్యాహ్నం బగుడు తీవ్రాతపసంతాసక్లేశంబు సహింపనేరక మేనఁ జెమ్మటలు గ్రమ్మ నలయికదీర నొకచెట్టుక్రిందఁ బండుకొని గాఢముగా నిద్రఁబోయెను.

సీ. పలురంగు లమరు పిట్టల పక్షపింఛము
                ల వతంస కుసుమంబులందుఁ జేర్చి
    కరి కుంభ లబ్ధ ముక్తామధ్యఘటితోరు
                కురువిందముల్ మెరయఁబూని
    లలిత పల్లవకోమలములైన వల్కలాం
               శుకములంగీలు దుస్తులు ధరించి
    నవరత్నమయ కంకణలలాటికాంగది
               రళనోర్మికాద్యాభరణములూని
గీ. యుత్తమతురంగమం బెక్కి యొక నిషాద
    కన్య యాదారి శరకార్ముకములఁ దాల్చి