పుట:కాశీమజిలీకథలు -09.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

లకు దయచేయుఁడు. అని పలికి సవినయముగాఁ దీసికొని నాతిధ్యమిచ్చి యుచితసభాసీనుం గావించినది. అతండు దాని నభినందించుచు మఱేమియును లేదు. నారాక మీ రాజపుత్రిక కెఱింగించి యాపని నిప్పింపుమని నిన్నుఁ గోరుచుంటిని ఇయ్యనని చెప్పినచో వెంటనే మాయింటికిఁ బోయెద. నిదియే నీవు నాకుఁ గావింపదగిన యుపకారమని పలికిన విని యక్కలికి యిట్లనియె.

మాతల్లి ఱేపో నేఁడో రాఁగలదు. వచ్చుదనుక మీ రిందుండుఁడు. ఆమె సవరణలు చేయఁగలదు. అయినను మీరు గోరితిరి కావున నీరాత్రి రాజపుత్రికతో మీ మాట ప్రస్తావించి చూచెదను. కార్యసాఫల్యమగునని తోచినచో రేపు మిమ్ముఁ దీసికొని పోయెద లేనిచో నశోకవతి వచ్చువఱకు నుండవలసినదే యని చెప్పినది అతడంగీకరించి మఱునాఁడు సాయంకాలమునకుఁ దిరుగ వత్తునని చెప్పి యెం దేనిం బోయెను

రాగవతియు వెంటనే కల్పలత యంతఃపురమున కరిగినది. దానిం జూచి కల్పలత రాగవతీ! మీ యమ్మవర్తమాన మేమైనందెలిసినదియా యెందున్నదియో? వ్రాసినదియా? అని యడిగిన నది అమ్మా! ఆమె వార్త లేమియుం దెలియలేదు. ఎందున్నదో జాబులేదు. మఱియు రాజవాహనుఁడు చెఱసాలనుండి తప్పించుకొని సాయంకాలమున మాయింటికి వచ్చి మాయమ్మను జీరెను. నే నామె యూరలేదని చెప్పినంతఁ దనరాక మీకుఁ దెలుపుమనియుఁ బతంగము నిత్తురేమో యడుగు మనియు నన్ను వినయముతో వేడుకొనియెను. నే నంగీకరించి వచ్చితిని. అని యెఱింగించెను

ఆ! ఏమీ! రాజవాహనుఁడు చెఱసాలనుండి తప్పించుకొని వచ్చెనా? వాని నీవు జూచితివా? ఎట్లున్నవాఁడు! అని యడిగిన నది అమ్మా! చీఁకటిలో నేనతని రూపమును జూడలేదు. తాను రాజవాహనుఁడని చెప్పెను. ఱేపుసాయంకాలమున మరల మాయింటికి రాఁగలఁడు. సెలవైనఁ దీసికొని వత్తుననుటయు నామె అయ్యయ్యో! వాని మీ యింటియొద్ద నుండు మనక యెందులకుఁ బో నిచ్చితివి? తిరుగా వచ్చునో రాఁడో కానిమ్ము. నీ విప్పుడే యింటికిఁ బొమ్ము. మీ యింటిదాపుల నెచ్చటైన నుండునేమో! వెదకింపుము. స్త్రీ వేషము వైచి తీసికొని రమ్ము. అని మఱికొన్ని మాటలం జెప్పి నప్పడతి నంపినది. కల్పలత కారాత్రి గడియ యుగమువలె దోచినది. తెల్లవారి జలక మాడి యేఁడుమాదిరుల దుస్తుల నలంకారముల ధరించి మార్చి మార్చి కడకొకదినుసువేష మంగీకరించి నిలువుటద్దమునఁ జూచుకొనుచు లోపముల సవరించుకొనుచు నిష్కుటమునందలి విలాసభవనం బలంకరింపఁజేసి యంతరంగికసఖులతో నందుఁ బ్రవేశించి యందందుఁ సఖులఁ గావలి యుంచి ప్రొద్దువంకఁ జూచుచుఁ దదాగమనమున కెదురు చూచుచుండెను.

అంతలో రాగవతి ఆ రాజవాహనునికి బురకా వైచి తీసుకొని వచ్చి సఖినిర్దిష్టమార్గంబునఁ విలాసభవనంబునఁ బ్రవేశపెట్టినది. రాజపుత్రిక సఖులచే వాని కర్ఘ్య