పుట:కాశీమజిలీకథలు -09.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10]

కనకలతిక కథ

73

పాద్యాదులతో నివాళి యిప్పించి యుచితాసనాసీనుం గాపింపఁ జేసినది. రాజవాహనుఁడు కల్పలతకు నమస్కారముఁ గావించెను.

ఆమె తదీయ రూపరేఖావిలాసముల విలోకనములఁ గ్రోలుదానివలె నాలోకింపుచుఁ దారుణ్యము నభినందించుచు లావణ్యమును గొనియాడుచు నవయవసౌష్టవమును బ్రస్తుతింపుచుఁ దేజోవిశేషమును బొగడుచు విస్మయావేశహృదయముతో నొడ లెఱుంగక నిలువంబడి చూచుచుండెను.

అప్పు డతండు లేచి దేవీ! నీ యాదరమునకు మోదము వహించితిని. నీ యౌదార్యమును గుఱించి అశోకవతి చెప్పినదానికన్న నిబ్బడిగా గనంబడుచున్నది? నా కిం దుండరాదు. వేగ మింటికిఁ బోవలయును. నీ యొద్దనున్న పక్షి నిప్పింతునని యశోకవతి నన్నుఁ దీసికొనివచ్చినది. ఆమెతో రాలేకపోయితిని. దారిలోఁబెక్కు చిక్కులంబడితిని దైవకృపచే విముక్తుండ నైతిని. మధువర్మపైఁ గసి తీర్చుకొనవలసి యున్నది. వేగబంపుదువేయని పలికిన విని యక్కలికి చూపు లతనిపై వ్యాపింపఁ జేయుచు నెఱింగినదైనను నతని నోటిమాటలు విను తలంపుతో నిట్లనియె.

సుకుమారా! అశోకవతి నీతో నేమి చెప్పినది? ఎప్పుడు బయిలుదేరితిరి? ఎం దెందుఁ దిరిగితిరి? ఎట్లు బద్దుండవైతివి? ఎట్లు విముక్తుండ వైతివి? సవిస్తరముగాఁ జెప్పుమని యడిగిన నతండు పూసగ్రుచ్చినట్లు తాను బయలుదేరినది మొదలప్పటివఱకు జరిగిన కథ యంతయుం జెప్పెను. కల్పలత శ్యామలాపురంబున మదపుటేనుఁగను హుంకారము సేసి యాపితిరఁట. ఆ వార్త దేశము లెల్లెడ నక్కజముగాఁ జెప్పుకొనుచున్నారు. మీరేల చెప్పితిరి గారు?

రాజవాహనుడు - అదియొక ప్రజ్ఞయా యేమిటి? ఒరులచే బద్దుండనగు నాపరాక్రమము సిగ్గు. సిగ్గు.

కల్పలత - రామచిలక మీ కులముపై నేమిటికి గీటు పెట్టినది.

రాజ - దానికిం దెలియక.

కల్ప - పోనిండు. కనకలతిక మంచి యుపకారము గావించినది గదా? దానింటికి బోయి యభినందింపజేయకుండ నిక్కడకు వచ్చుట కృతజ్ఞతాధర్మమా.

రాజ - తల యూచుచు నేమియు మాటాడఁ డయ్యెను.

కల్ప- ఇప్పుడు మీ యభిలాష యేమి?

రాజ - పతంగప్రదానము చేయుమని.

కల్ప – వీరపురుషులు బ్రాహ్మణులవలె దానము లడుగుదురా?

రాజ - దానము గాదు. ప్రతిఫలం బేదేని యిచ్చికొనవచ్చును.

కల్ప - దీనికి నాకేమి ప్రతిఫల మిత్తురు?

రాజ - ఏది గోరిన నది.

కల్ప - ఆ మాట నిశ్చయమేనా? జ్ఞాపక ముంచుకొనుడు.