పుట:కాశీమజిలీకథలు -09.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనకలతిక కథ

71

గదా! లక్షదీనారముల వెలఁగలయా నగ లన్నియు నందలి యధికారు లందరు పంచికొని యారాత్రి వాని విడిచివైచి వానిపేరున మఱియొక పురుషు నాగదిలోఁ గూర్చుండఁజేసి యాలోపముఁ దెలియకుండఁ జేసిరి.

రాజవాహనుఁడు వసుమతివెంట మెల్లగా నా చెఱసాలనుండి యీవలకు వచ్చెను. అప్పుడే కనకలతిక యంతఃపురమునకు రమ్మని కోరికొనినదికాని యతం డంగీకరింపక మఱియొకప్పుడు వత్తుననిచెప్పి యారాత్రియే యాపట్టణము దాఁటి మఱి కొన్ని దినంబులకు మహేంద్రనగరంబున కరిగెను.

రాజవాహనుఁడు జాముప్రొద్దువేళకు మహేంద్రనగరము జేరెను. ఒక వీథిం బడిపోవుచు రాజపుత్రిక సఖురాలు అశోకవతి యిల్లెక్కడ నున్నదియో నీవెఱుంగుదువా? అని వీథి బోవుచున్న యొక దాది నడిగెను. ఆదాది దాని నెఱిఁగిన దగుటఁ గోటకు బశ్చిమముగానున్న వీథిలో నూటపదకొండవ నెంబరుగల మేడ దాని యిల్లని గురుతు లెఱింగించి యాదాది యేగినది.

ఆతం డది చెప్పిన గురుతులు చూచుకొనుచు నడుగుచు బోయి పోయి ప్రొద్దు గ్రుంకునప్పటికి దానియిల్లు పట్టుకొనియెను. వీథి నిలువంబడి ఆశోకవతీ! అశోకవతీ! యని పెద్దయెలుంగునఁ బిలుచుటయు దానికూఁతు రీవలకు వచ్చి అశోకవతి యూరికేగినది. వీరెవ్వరు? దానితో మీకేమి పనియున్నది యని యడిగినఁబనియే యున్నది. ఆమె నీ కేమగును?

ఆమె మాతల్లి ! ఏమి పనియో చెప్పరాదా ?

రాజ - ఎందు బోయినదియో నీవేల చెప్పవు?

చెప్పకేమి ? రాజవాహనుఁడను వానిఁ దీసికొని వచ్చుటకై పోయినది.

రాజ - అతఁ డెందున్న వాఁడు?

ఓహో ! నాకు పనియున్నది. మాశంకల కుత్తరము జెప్పఁ దీరికలేదు. కల్పలత వేచియుండు నంతఃపురమునకుఁ బోవలయును. మీరెవ్వరో చెప్పినం జెప్పుడు?

రాజు- నీ విప్పుడు కల్పలత యంతఃపురమున కరుగుచున్నావా?

అవును. కల్పలత పేరు నీకెవ్వరు సెప్పిరి?

రాజ - మీయమ్మయే చెప్పినది. నేనే యా రాజవాహనుఁడ. కల్పలత యొద్దనున్న శారదపతంగంబు నిప్పింతునని నన్నుఁ దీసికొని వచ్చినది.

ఓహో! నీవు రాజవాహనుఁడవా? బద్దుండవైతివఁట ఎట్లు విడిపించుకొని వచ్చితివి?

రాజ -- ఒక పుణ్యాత్మురాలి మూలమునఁ దప్పించుకొని వచ్చితిని. పరోపకారకారణంబు లంతటను గలిగియున్నాను. నీవు గూడ నాకొక యువకారముఁ జేయగలవా?

నావలనఁ గాదగిన పనియేదియో చెప్పుఁడు. తప్పక గావింతుగాక లోప