పుట:కాశీమజిలీకథలు -09.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    లోచింపఁగ నిర్మాణపు
    వైచిత్ర్యంబునగు నిదియె పారంబౌరా.

శా. ఔరా! చొక్కపుచెక్కుటద్దముల తళ్కాహా! లలాటంబు సిం
    గారం బద్దిర! లోచనాంచలత్కాంతుల్ బలే! వక్ష మ
    య్యారె! బాహువిలాసనటల్ బళిర! దేహచ్చాయమేల్‌కొనహో
    తారుణ్యంబు సెబాసు! పాదయుగనాంతర్యంబు మజ్జారె! హా!

అని పొగడుచు వసుమతీ! నీ వనిన నేమో యనుకొంటిని. ఇట్టి త్రిలోకాభిరాము మనోహరుఁగాఁ బడయురా మది గదా భాగ్యము! వీని విడిపింతుము మనకేమి పారితోషిక మిచ్చునో మెల్లగా నడుగుము. అని పలుకుచు వానిచెంతకుఁ బోయి వసుమతి మాటుగాఁ జేసికొని యోరచూపుల నతని సోయగముఁ జూచుచుండెను. అప్పుడు వసుమతి సౌమ్యా! మీ దేదేశము? తలిదండ్రు లెవ్వరు? దగ్గిరచుట్టము లెవ్వరున్నారు? ఈమె మా రాజపుత్రిక మీ బంధనవృత్తాంతము విని జాలిపడి చూడవచ్చినది. ఈమె తలఁచిన మిమ్ము విడిపింపఁగలదు. మీ వృత్తాంత మెఱిగింపుఁడని యడిగిన నతండు కనులెత్తి చూచి యిట్లనియె.

నేను పుళిందచక్రవర్తి కుమారుఁడ. నాపేరు రాజవాహనుఁ డందురు. కల్పలతయొద్దనున్న శారద పతంగనిమిత్తము మహేంద్రనగరంబున కరుగుచు దారి తప్పి యీ యూరు వచ్చితిని. గుఱ్ఱ మెక్కితినని యపరాధము నిరూపించి వీరు నన్నుఁ బట్టికొనిరి. నాచేతి విల్లుజారకున్న వీరిబల మెట్టిదో చూచి యుందును. మీ రాఁడువారు జాలిపడిన లాభమేమి? న న్నెట్లు విడిపింపగలరు? మీవాక్సహాయమునకే సంతసించితిని. నాకుఁ జాలమంది బంధువులు గలరు. ఈవార్త తెలిసిన వచ్చి యీ రాజు పీచమడంతురు. కాలమున కెదురుచూచున్నానని పలికిన విని వసుమతి యిట్లనియె.

రాజవాహనా! ఈమె నిన్నెట్లో కష్టపడి విడిపించును. ప్రత్యుపకార మేమి గావింతువు? నప్పు డతండు నా యావజ్జీవము కృతజ్ఞుండనై యుండెదఁ జాలునా?

వసుమతి - అట్లు కాదు. ఆమె ప్రాణమును నీవు పాలింపవలయునఁట. ఇందుల కేమందువు.

రాజ - సరిసరి. ఆమె పాలకుండ నగదును?

వసుమతి – తొల్లి రుక్మిణీదేవి తండ్రితో విరోధపడి శ్రీకృష్ణుని భజింప లేదా? అట్లేయని యామె యభిలాషపడుచున్నది.

రాజ - అట్లయిన లెస్సయే. అంగీకారము కాకేమి ?

అనుటయు సంతోషింపుచుఁ గనకలతిక తన మేని యాభరణములన్నియం దీసి సుమతికిచ్చి వీని నీమఱఁదికిమ్ము. ఎట్లయిన వీని నీరాత్రి విడిపించునట్లు చేయుమని పలుకుచుఁ దానింటికిఁ బోయినది ద్రవ్యమునకు సాధ్యముగాని పని యుండదు