పుట:కాశీమజిలీకథలు -09.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

దేవతావిపరీతాకారము గలిగియున్నవాఁడు. అని యడిగిన నతండు దేవా! ఈతం డొక బ్రాహ్మణుఁడు. భూలోకవాసి. యక్షిణీమంత్రసిద్ది వడసి యిందు వచ్చి యున్నవాఁడని చెప్పినవిని యతండు చాలు చాలు. వీఁడు దురభిమానపరిభూతుడువలెఁ గనంబడుచున్నవాఁడు. వీఁడు దేవతాలోకనివాసమునకుఁ దగఁడు. వేగమ భూలోకమునకు బంపివేయుమని యాజ్ఞాపించెను.

ఆవార్త మాతల్లి విని యడలుచుఁ బోయి పురుహూతు నడుగుదమ్ముల వ్రాలి మహేంద్ర! రక్షింపుము. ఆ బ్రాహ్మణుఁడు నాభర్త. తపస్సిద్ధివలన నన్నుఁ బడసెను. మిమ్ముఁ జూడక లేవలేదు. గర్వాభివిష్టుఁడు కాఁడు. అతనితోఁ గూడ నేను భూలోకమునకుఁ బోవలయునుగదా? అందలి దుఃఖములు నే ననుభవింపఁజాలను. అనుగ్రహించి శాపప్రతీకారము గావింపుమని వేడుకొనియెను.

ఇంద్రుం డాచంద్రముఖి కుబేరునకు దగ్గిరచుట్టమని తెలిసికొని అయ్యా? కార్యము మిగిలినది. తెలియక శపించితిని నాశాప మమోఘము. మిముఁబోటులకు భూలోకవాసము క్లేశకరము. కర్తవ్యమేమని యాలోచించుచు నీశాప మతఁడు గాక మరియొకం డెవ్వఁడైన ననుభవించిన వాని నంటదు. అట్టివానిం జూడుమని యుపాయము జెప్పెను. అప్పుడు మాతల్లి నన్నుఁ జీరి మీతండ్రిశాపము నీవు భరింపుము. తొల్లి యయాతివార్థక్యము వహించిన పూరుండువలె నీవును విఖ్యాతి బొందఁగలవని పలికిన నేను మహాప్రసాదమని యంగీకరించితిని.

అప్పుడు కుబేరుని దూతలు నన్ను భూలోకమునకుఁ దీసికొనివచ్చి విడిచిపోయిరి. నేను భూసంచారముఁ జేయుచు జయపురంబునకుఁ బోయి తదధిపతియగు విజయపాలుఁడను నృపాలు నాశ్రయించి యతనికొలువు చేయుచుంటిని. ఆ రాజు చాల యుత్తముడు. ఈ మధువర్మవలన నతనికి తటస్థించిన ప్రాణహాను లైదుసారులు తప్పించితిని. అతండు నన్ను సుమతియని పిలుచుచుండువాఁడు.

అతనిభార్య తేజస్వి యనునది పుష్పచాపదాపంబునం జేసి నాయందు లేనిపోని యపరాథము లాపాదించి భర్తకు నాయం దెక్కుడుకోపము గలుగఁజేసినది. అతం డామెమాట సత్యమని నమ్మి నన్నుఁ బట్టించి బందీగృహంబునఁ బెట్టించుటకుఁ బ్రయత్నించెను. నే నెట్లో తప్పించుకొని పారిపోయితిని.

ఒకనాఁ డొకయగ్రహారమున నొకబ్రాహ్మణుని యింటి కతిథిగాఁ బోయితిని. అతండు నాలుగువేదములు, ఆరుశాస్త్రములు విద్యార్థులకుఁ బాఠముఁ జెప్పుచుండెను. భోజనానంతరమున నేను వారివిద్యార్థులకుఁ దప్పులు దిద్దితిని. ఆ బ్రాహ్మణుఁడు నీ వేమి చదివితివని యడిగిన నన్నివిద్యలుం జదివితినని చెప్పితిని. వెఱగుఁ పడుచు నీ ప్రాయము కడుచిన్నది. ఇంతలో నిన్నివిద్య లెట్లు గ్రహించితివని యబ్బురపాటుతో నడుగుటయు నేను వృత్తాంతమంతయు నెఱింగించితిని ధన్యుండ నైతినని