పుట:కాశీమజిలీకథలు -09.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

అతండు నిషాదకుమారుఁ డంటివికాదా! కులహీను నెట్టువరింపమే. యేమనియెదవు? అని యున్మత్తవోలెఁ బలుకుచున్న కల్పలతతో నశోకవతి యిట్లనియె.

సఖీ! అతండు వచ్చిన తరువాతఁ జూచి యిప్పటికి తోచినరీతిఁ గావింప వచ్చును. ఇప్పు డీ తర్కములతోఁ బ్రయోజనములేదని చెప్పినది. అగునగు ననుమతించితిని. అతని నీవు వెంటఁ బెట్టికొనిరాక యందు దిగవిడిచి వచ్చితివేల? ఇప్పుడే పోయి తీసికొనిరమ్ము. పొమ్మని యాజ్ఞాపించినది.

అశోకవతి హుటాహుటి పయనంబులఁ బోయి చిలుకయున్న పల్లెఁ జేరి మున్ను బసఁజేసిన యింటికి బోయి తనవారేమైరని యడిగిన నాయింటివారు, ఇందుండి నాలుగు దినముల క్రితమే వెళ్ళిపోయిరని చెప్పిరి. అప్పుడది యోహో? మాయూరికి కాక వారెందుఁబోయిరి? దారితప్పి మఱియొక చోటికిం బోయిరి కాఁబోలు నా కెదురు పడలేదే? అక్కటా? నేఁ జేసిన సన్నాహ మంతయు రిత్తయైపోవునా? వాఁడు విసుఁగుఁ జెంది యింటికే పోయెనా? అని యనేక ప్రకారముల దలపోయుచు దిరుగమార్గములు పరికించుచు మహేంద్రనగరాభిముఖంబుగా బోవఁదొడంగినది మహేంద్ర నగరంబున కనతిదూరములో మఱియొక మార్గమునుండి వచ్చుచున్న కింకరులు గనంబడుటయు వారిం జూచి పల్కరించి మీరింత యాలసించితిరేల? ఎందు బోయితిరి? రాజవాహను డేఁడి? యని యడిగిన నా రాజభటు లిట్లనిరి.

అమ్మా! మీ సెలవు ప్రకారము మేమాయన కుపచారములు సేయుచుఁ బదిదినము లాపల్లెలో నుంటిమి. ఆయన యడిగిన ప్రశ్నములకుఁ జిలుక యుత్తర మిచ్చినది. అందుఁ దాను కిరాతకులమని వ్రాసికొనిన దానిమీఁద గాదని తెలియుటకై గీటు వ్రాయించినదఁట. అందులకై యాయన కాచిలుక మాటలయందు విశ్వాసము కుదిరినదికాదు. అప్పుడే యక్కడనుండి బయలుదేరితిమి. అతని గుఱ్ఱము వెంట మేమును వచ్చుచుంటిమి.

ఒకచోట మార్గము చీలి రెండు విధములుగాఁ బోయినది. మన యూరికి వచ్చు మార్గమిది యని మే మెఱింగించితిమి గాని యతని గుఱ్ఱ మీదెసకు మరలక యా రెండవదారిం బరుగెత్తినది. మేమును వెంటఁబోయితిమి. ఆ మార్గము జయపురమునకుఁ దీసికొని పోయినది. మందపాలుఁడు మధువర్మయను రాజు లిద్ద రేకమై కొన్నిసంవత్సరముల క్రిందట తన్నగరాధీశ్వరుఁడగు, విజయపాలుం బరిమార్చి యాదేశ మాక్రమించుకొని తమ ప్రతినిధుల నందుంచి పాలించుచున్నారఁట ఇప్పు డాదేశమును జెరిసగముఁ బంచుకొనుటకై వచ్చి యప్పురంబున బసఁ జేసి యున్నవారఁట. పట్టణ మంతయుఁ జక్కఁగా నలంకరించిరి. వారివురు పాదచారులై రాజమార్గమున విహరించుచు నగరసుందరముఁ జూచుచుండిరఁట. అట్టి సమయమున మే మనుగమింపఁ బట్టణము నడివీథిం బడి రాజవాహనుం డశ్వారూఢుండై యరుగుచుండెను. పౌరులు వింతగా నతనిం జూడఁ దొడంగిరి.