పుట:కాశీమజిలీకథలు -09.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అశోకవతి కథ

47

కొన్నది. అశోకవతి నవ్వుచు జవ్వనీ! నీకింత తొందరయేల? వీని కులశీలాదులఁ దెలిసికొనక చక్రవర్తికుమారుండని నంతనే భర్తయని నిరూపింతువా? చాలు జాలునని యాక్షేపించుటయు నాయించుబోఁడి ఏమో భగవంతుఁడు నానోట నిట్లనిపించెను నేను స్వయముగాఁ దెలిసి యనిన మాటగాదు. వాఁడు క్షత్రియకులుఁడు కాఁడా యేమి? యా రహస్యమేమో తెలియఁ జెప్పుమని యడిగిన నశోకవతి యిట్లనియె.

ప్రియసఖి! వినుము. నే నాపతత్రమునిమిత్తము పుళిందునొద్ద కరిగితిని గదా! ఆ నిషాదునకు బుత్రికయుఁ బుత్రుఁడుం గలిగియున్నారని మనము విని యున్నారము నే నీయాటవస్తువుల దీసికొని పుళిందుని కర్పించితిని. అతండు తన బిడ్డ లాతోటలో నున్నారు. వారికిమ్మని నన్నందుఁ బంపెను. అప్పుడు వా రాపక్షి ప్రవరముతో ముచ్చటించుచున్నారు. తరుణీమణీ! నేను వా రిద్దరం జూచి వెఱఁగుపాటుతో గడియవరకు నేమియు మాటాడలేక పోయితిని. ఆహా? ఏమి వారి సౌందర్యము! అం దాకుమారునిబుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకొనవలయునని బుద్ధి పుట్టినది ఏ రాజకుమారుఁడు ఏమారుఁడు ఏసుకుమారుఁడు ఏ వీరుఁడు వానింబోలఁగలడు? మన వస్తువులచే వారు లోభపడుదురా? వానిసౌందర్యము నీకుఁ జూపు దలంపుతో మనయొద్దనున్న పక్షినే నీకిప్పింతునని చెప్పి వానిం దీసికొని వచ్చితిని. శ్యామలాపురంబునఁ బ్రజలకు మహోపద్రవంబుఁ దప్పించె వీఁడే యా పురుషరత్నము. వీఁడే పుళిందకుల జక్రవర్తి కుమారుఁడు. అని తాను పోయి వచ్చిన వృత్తాంతమంతయు నెఱింగించినది.

అప్పు డక్కాంతారత్నంబు చింతాకులస్వాంతయై యొక్కింత సేపేమియుం దోచక ధ్యానించి తల యూచుచు బోఁటీ! నీ మాటలచే నేను మోసపోయితిని. చక్రవర్తికుమారుఁడంటివి కాని పుళిందకుల చక్రవర్తి కుమారుడంటివేని నేను తొందర పడకుందునుగదా! వీఁడే నా భర్తయని పలికి మరల వెనుక తీయుట యెట్లు? కిరాత కుమారునెట్లు పెండ్లియాడుదు? ఇప్పుడు కర్తవ్యమేమి? అని యాలోచించుచు వెండియు నా చిత్రఫలక ముపలక్షించి చక్కదనం బభివర్ణించుచుఁ గులము మాట మరచిపోయి మరల ముద్దు పెట్టుకొనుచు నశోకవతీ! యీ సుందరు నెందు విడిచి వచ్చితివి? మీయింటఁ బెట్టితివా యేమి? వేగఁబోయి దీసికొనిరా. అని యాజ్ఞాపించుటయు నా జవరాలిట్లనియె.

నాతీ! నీతోఁ జెప్ప మరచితిని. దారిలో శకునములు చెప్పు చిలుకను వాఁడు కొన్ని ప్రశ్నము లడిగెను వానియుత్తరములఁ బడయుటకై పదిదినములం దుండవలసి వచ్చినది. తరువాత వానివెంట బెట్టుకొని రమ్మని మన పరిజనులనందుంచి ముందువార్త నీకుఁ జెప్పుటకై వచ్చితిని. ఆ మితి నిన్నటితో ముగిసినది. నాలుగుదివసములలో రాఁ గలఁడని చెప్పినది.

మరల స్సృతి నభినయించుచు రాజపుత్రిక అశోకవతీ! మరచిపోయితిని.