పుట:కాశీమజిలీకథలు -09.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

కల్పలత — నీమాట లేమియు నాకర్థము లగుటలేదు. నన్ను వేపక యేమి జరిగినదియో సత్యము చెప్పుదూ?

అశో - త్రిభువనాశ్చర్యకరసౌందర్యశౌర్యధైర్యవిశిష్ట మగు వస్తువుం దెచ్చితినని చెప్పలేదా?

కల్పలత — ఆ యాశ్చర్య మేదియో చూపుము. అనుటయు నగుమొగంబుతో నశోకవతి తాను వ్రాసి తెచ్చిన రాజువాహనుని చిత్రఫలకము తీసి యామెచేతి కిచ్చి యిదియే నేను దెచ్చిన వస్తువని చెప్పినది.

కల్పలత - భ్రూలతాయుగళంబు ఫాలతలం బెగంద్రోయ నాచిత్రఫలకం బంది పుచ్చుకొని యబ్బురపాటుతోఁ జూచుచుఁ బ్రతి ప్రతీకళోభాచమత్కారసౌష్టవం బభివర్ణించుచు సఖీ! ఈ చిత్తరువు కంతువసంతజయంతాదులలో నెవ్వరిఁదో కావచ్చును. సర్వావయవసుందరుఁడగు నిట్టి పురుషరత్నము మానవజాతిలో నుదయించుట యసంభవము. దీని నెక్కడఁ దెచ్చితివో నిజము చెప్పుమని యడిగిన సప్పడఁతి యిట్లనియె.

అశో - ఇట్టి సుందరుఁడు పుడమిలో లేఁడని నీవెట్లు చెప్పగలవు ?

కల్పలత — ఇదివఱకు మనము భూమండలమ్మునం గల రాజపుత్రుల చిత్రఫలకముల నెన్ని జూచితిమి? ఒక్కటైన నిట్టి సౌందర్యము గలిగినది కసంబడినదా?

అశో - రాజపుత్రులలోఁ గాక యితరులలో సౌందర్యశాలు రుండరనియా నీ యాశయము?

కల్పలత - అభిజాత్యము లేని సౌందర్యము సంస్తుత్యము కాదని నా తలంపు. మఱియు నుత్తమసౌందర్యవంతు లుత్తమకులంబునంగాని బుట్టరని నిరూఢముగాఁ జెప్పఁగలను.

అశో - పోనిమ్ము. ఇట్టిసుందరునిం దీసికొని వచ్చిన నాకేమి పారితోషిక మిత్తువు?

కల్పలత - నా యెశ్వర్యమే నీది. వేర పారితోషిక మీయనేల? నిజముగా నిది మనుష్యకుమారుని రూపమే?

అశో - అగుననియే చెప్పఁగలను.

కల్పలత - నీవు చూచితివా? వింటివా?

అశో - చూడక వినిన మాటలం బట్టి చెప్పుదునా?

కల్పలత - వీఁ డెవ్వని కుమారుఁడు?

అశో - చక్రవర్తి కుమారుఁడు.

కల్పలత - అట్లైన వీఁడే నాభర్త.

అని పలుకుచు నా చిత్రఫలకమును గౌఁగిటం చేర్చుకొని ముద్దుపెట్టు