పుట:కాశీమజిలీకథలు -09.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అశోకవతి కథ

45

వివాహము కాదు. మఱి రెండునెలలు గతించినతరువాత వచ్చినచో నీకగు కన్యకతెఱం గెరింగించెదను. అని యుత్తరము వ్రాయబడియున్నది. అప్పుడు పుళిందకుమారుఁ డాయుత్తరముల విమర్శించుచు నిందలి నిజానిజంబు లిప్పుడు తెలియవు. నిలకడమీఁద దెలియునని పలుకుచు సుమంతుని మైత్రితోఁ బదిదినములు దృటిగా వెళ్ళించెను.

తరువాత రాజవాహనుఁ డడిగిన ప్రశ్నముల కిట్లుత్తరము వచ్చినది. కిరాతకులము అను దానిమీద గీటు పెట్టఁబడియున్నది నీవు కోరినవస్తువు వెంటనే నీకు లభింపదు. కొన్నిదినములు గతించిన తరువాత స్వకీయముగా లభింపఁగలదు.

దాని ముమ్మారు చదివికొని రాజవాహనుఁడు చాలుచాలు. ఈచిలుక చెప్పు శకునమొక్కటియుఁ దత్కాలమున నిదర్శనమేమియు గనంబడదు. స్ఖాలిత్యము లగఁబడుచున్నవి. నాది కిరాతకులము కాఁదట. ఇంతకన్న నసత్య మేమి యున్నది? లోకులకు నీతిలేదు. సుజ్ఞానసంపన్నులగు మనుష్యులకు, యుక్తాయుక్తవివేకశూన్యములగు పక్షులు శకునములు చెప్పుటా? ఆహా! ఎంత చోద్యముగా నున్నది. ఏదో చెప్పునని నేను వృధగాఁ బదిదినములు గడిపితినే? కానిండు. ఇందువలన మీసాంగత్యలాభము గలిగినదని పలికిన విని సుమంతుఁ డిట్లనియె. వయస్యా! ఈ శుక మట్టిది కాదు. దీని మాటలయం దొక్కటియు నసత్యముండదని వాడుక. తొలుత నీవలెనే దీని నాక్షేపించినవారే తిరుగవచ్చి ప్రశ్నల నడుగుచుందురఁట నిడివిమీఁదఁ గాని నిజము తెలియదుగదా? ఇది ముఖప్రీతివాక్యములఁ జెప్పదు. నే నుండగనే యొక రాజపుత్రునకు మీరు రాజ్యపదభ్రష్టులగుదరని వ్రాయించి యిచ్చినది. తరువాత నట్లు జరిగితీరు నని యతం డుపన్యసించెను.

నా కులముబట్టియే యది యసత్యము చెప్పునను నేను తలంచుచున్నానని రాజవాహనుఁడు వాదించెను. అందేమి దేవరహస్యము లున్నవో యని సుమంతు డనువదించెను. ఈరీతి వారు పెద్దయుఁ బ్రొద్దు చిలుకం గుఱించి ముచ్చటించుకొనిరి. అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథఁ దరువాత నెలవునఁ జెప్పం దొడంగెను.

178 వ మజిలీ

అశోకవతి కథ

కల్పలత తనచెంతకు వచ్చి యశోకవతిం జూచినతోడనే మోము వికసింప నెచ్చెలీ! యాపక్షిం దెచ్చితివా? విశేషము లేమని యడిగినది.

అశో -- ఆ పనికంటు సుందరమైన వస్తువుం దెచ్చితిని.

కల్ప - స్వజాతియా ? విజాతియా ?

అశో - స్వజాతికాదు కాని స్వజాతియే. విజాతియుఁ గాదు విజాతియే.