పుట:కాశీమజిలీకథలు -09.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామచిలుక కథ

43

మారాజపుత్రిక దీనిం గొనవలయునని యెంతయో ప్రయత్నము చేసినది కాని యీ వర్తకున కదియె జీవిక యగుట నమ్మఁడయ్యెను. మన మిప్పు డిందాగి యావింత చూతమా? అని యడిగిన నతండు సందియమేలా? చూచుటయేకాక నేను కొన్ని శకునముల నడిగెదనని పలికి పరిజనులతోఁగూడి నతం డాపల్లెలోనికిఁ బోయెను.

ఆ వర్తకుఁ డందు వచ్చిన వారికి సమస్తసదుపాయములుగల బసలనేకములు గట్టించి యుంచెను. వా రొకదానిలోఁ బ్రవేశించి శకునము లడుగుటకై యా చిలుకయొద్దకుఁ బోయిరి. అది దినమునకు నలుగురకుమాత్రమే శకునములు చెప్పును. అది చెప్పినమాట లావర్తకుఁడు పత్రికలపై వ్రాయించి యిచ్చుచుండును. అడుగువారు గూడ బత్రికలపై వ్రాసియే యడుగవలయును. ప్రవేశక్రమంబునఁ బ్రత్యుత్తరములు వ్రాసియిచ్చి యంపుచుందురు రాజవాహనుఁ డొకపత్రికపై కొన్ని ప్రశ్నముల వ్రాసి యందుల కీయవలసిన విత్తముతోఁ గూడ నాపత్రిక వారి కర్పించెను. అంతకుమున్ను పెక్కండ్రు వ్రాసియిచ్చిన పత్రికలు నిలువయున్నకతంబుననాఁటికిఁ బదపదివసంబు నీప్రశ్నముల కుత్తర మీయఁబడునని తెలియఁజేసిరి. కావున నంత దనుక నతండందుండక తీరినదికాదు.

అప్పు డశోకవతి యాలోచించి రాజవాహనా! నే నిల్లుబయలుదేరి చాల దినములై నది. మా రాజపుత్రిక నారాక వేచియుండును. నీకుఁ దగిన పరిచారికల నిందుండ నియమించెదను. పదిదినము లిందుండి ప్రశ్నలం దెలిసికొని పిమ్మట వీరి వెంట మహేంద్రనగరంబునకు రమ్ము, ముందుగా నేను బోయి మీరాక రాజపుత్రిక కెఱింగించి తగిన సన్నాహము గావించెదనని చెప్పి యొప్పించి నమ్మకమైన పరిజనుల నిందుంచి యాయశోకవతి మహేంద్రనగరంబున కరిగినది.

రాజవాహనుఁడు నాటిసాయంకాలమున నేమియుం దోచక గుఱ్ఱమెక్కి యందందు విహరింపుచుండెను. మఱియొక రాజకుమారుఁ డశ్వారూడుఁడై యతని కెదురు పడియెను. ఇరువురు సంజ్ఞలఁగా బల్కరించుకొని విచిత్రప్రచారంబుల దమగుఱ్ఱముల నడిపించుచుఁ గొంతదూరము పోయిరి.

ఆ రాజపుత్రుఁడు రాజవాహనునితో సమముగా, గుఱ్ఱమును నడిపింప లేకపోయెను. మఱియుఁ దదీయతురంగారోహణ పాటవముఁజూచి యక్కజ మందుచు నొక్కచోఁ దనవారువము నాపి యారాజపుత్రుఁడు రాజవాహనునిం బ్రార్ధించి గుఱ్ఱమును దింపి హస్తగ్రహణము చేయుచు నిట్లనియె.

రాజ - పురుషసింహమా? మీ దేయూరు? యెవ్వని కుమారుండవు? ఈ యశ్వారోహణపాటవ మెందు నేర్చుకొంటివి ?

పులింద - మా గ్రామము పర్వతప్రాంతమందున్నది. నేను పులింద చక్రవర్తి కుమారుఁడను. నాపేరు రాజువాహనుఁ డందురు. ఇప్పుడు నాపాటవ మేమి