పుట:కాశీమజిలీకథలు -09.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నదటింకనుం దీరకున్నది. ఇది మరల లేచి పీచమడంచునేమో యను భయముతో నిందు నిలువజాలము. ప్రాణదాతవైన నీ కులశీలనామంబులు దెలిసికొనుట యావశ్యకమే కాని మాకిందు నిలువధైర్యము చాలకున్నది. మీరు మావెంట మాయింటికి రావలయునని ప్రార్థించుచుండ నా వెదండ మొకఘీంకారము గావించినది.

అప్పు డదరిపడి వారు కాలికొలఁది పారిపోయి యొక యింటిలో దూరిరి. రాజవాహనుఁడు హుంకార మొనరించి దాని లేవకుండఁ చేసెను. అంతలోఁ జాటుగాఁ దిరుగుచున్న రాజభటులు తుపాకులం గాల్చి దానిం బంచత్వము నొందఁజేసిరి.

మదపుటేనుఁగ జంపఁబడినదని తెలిసినతోడనే రాజమార్గము లన్నియుం బ్రజలచే నిండింపఁబడినవి. ఇండ్లతలుపులు తెరువఁబడినవి. దాసదాసీజనంబులు పెక్కండ్రు వచ్చి వధూవరుల వెదకి వాహనంబు లెక్కించి కోటలోనికిఁ దీసికొని పోయిరి. ఎవ్వఁడో మహాపురుషుఁడు వచ్చి యా యుపద్రవముఁ దప్పించెనని జనులు చెప్పుకొనఁ దొడంగిరి.

అని యెఱిగించువఱకు వేళ యతిక్రమించినది. తరువాతికథ పైమజిలీ యందు జెప్పదొడఁగెను.

177 వ మజిలీ

రామచిలుక కథ

అశోకవతి యమ్మరునాఁ డందు నిలిచి రాజదర్శనముఁ జేసి పోవుదమని పలికినది. కాని యతం డందుల కంగీకరింపక నాఁటి వేకువజాముననే వారాయూరు బయలుదేరి పోవుచుఁ గొన్ని పయనములు సాగించిరి.

అట్లరుగుచుండ నొకనాఁ డొకచోట మార్గమున కనతిదూరములో నొక గ్రామము రాజవాహనునికి నేత్రోత్సవము గావించినది. అశోకవతీ? ఈ యూరిపేరేమి? గ్రామము చిన్నదైనను సుందరమందిరారామశోభితమై యొప్పుచున్నది అని యడిగిన నది చిఱునగవుతోఁ గుమారా! నీ వడుగకున్నను నిందలివింత యొకటి నీ కెఱింగింపఁ దలంచుకొంటి నందులకే యిందు బండి నిలిపితిని. వినుము, ఈ పల్లె యందుఁ దులాధారుఁడను వర్తకుఁడు గలడు. పూర్వపుణ్యవశంబున వానికెట్లో యొకరామచిలుక లభించినది. అది యతీతానాగతవృత్తాంతముల శకునములు చెప్పుచుండును.

దాని దేవమందిరమున బంగారుపంజరములో నునిచి నిత్యము దేవతావిగ్రహమువలె వాఁడు పూజించుచుండును. అది చెప్పు శకునమువలన నావైశ్యుఁడు మిక్కిలిగా ధన మార్జించుచు నీమేడలన్నియుం గట్టించెను. దూరదేశమునుండి మహారాజుల రాజపుత్రులు, రాజపుత్రికలు, శకునము లడుగ నిచ్చటికి వచ్చుచుంచుదురు. పరిజనుల నంపుచుందురు. దీని వాడుక భూమండల మంతయు వ్యాపించింది.