పుట:కాశీమజిలీకథలు -09.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నవరత్నప్రభలచే గన్నులకు మిఱుమిట్లు గొలుపు రత్నపుటంబారియందు వధూవరులు గూర్చుండిరి. ఒకవంక బాణసంచ కన్నులపండువ సేయుచుండె అప్పు డాయుత్సవము రెండుక్రోశములు వ్యాపించి రాజమార్గంబునఁ దూరుపుగా నడచుచుండెను.

రాజవాహనుఁ డాయుత్సవమునకు ముందు దూరముగా నశోకవతితోఁ దిరుగుచుండ వినోదవిశేషము లన్నియు నశోకవతి వానికిఁ జెప్పుచుండెను. ఆయూరేగింపు కొంతదూరము వచ్చుసరికి వెనుక నల్లరి బయలుదేరినది. తూర్యనాదము లాగి హాహాకారములు నింగిముట్టినవి. గట్టు తెగిన ప్రవాహమువలె జనులు గుంపులు నలుమూలలకుఁ బరుగిడుచుండెను. కారణ మేమియో యెవ్వరికిం దెలియదు వెనుకవారు పరుగిడి త్రోసికొని వచ్చుచుండ ముందరివారును బరుగెత్తుచుండిరి. అయ్యో, అయ్యో, ఎంతప్రమాదము. చచ్చెఁ జచ్చె ననుశోకాలాపములు వినంబడఁ జొచ్చినవి. రాజమార్గము పట్టక ప్రజలు సందుగొందుల వెంబడి పారిపోవుచుండిరి.

రాజవాహనుఁ డాయల్లరి యేమని యశోకవతి నడిగెను. అది కొంతదూర మేగి తెలిసికొని బాబో, బాబో, పట్టపేనుఁగకు మదము దిగినదఁట దొరకినవారినెల్లఁ దొండముతో మోదుచుఁ గాళ్ళఁజిదుముచు, జిత్రవధఁ జేయుచున్నదఁట తొలుతనే మావటీని నేలఁ బడఁద్రోచి కాలరాచి చంపినదఁట ముందరివారిని వేయిమందిని బరిమార్చినదట. బాబూ! దూరముగాఁ బారిపోవుదము. రమ్ము ఈయూరి కేమిటికి వచ్చితిమో గదాయని పరితపించుచుండ విని నవ్వుచు రాజువాహనుఁ డిట్లనియె.

ఆహా! ఏమి యీ యూరివీరుల ధైర్యము? కొనియాడఁదగినదియే? పెంచిన ఏఁనుగకు మదము దిగిన వారింపలేకుండిరా? చాలుచాలునని యాక్షేపించిన విని యశోకవతి బాబూ! మద మెక్కిన దంతావళము నెవ్వరు బట్టగలరు? తుపాకులఁ గాల్చి చంపవలయును. అట్లు చేసిన దానిపైనున్న బెండ్లికొడుకు బెండ్లికూతురు మడియగలరు. ఏయుపాయము లేకయే వీరులుగూడఁ బారిపోవుచున్నారు. పదపద మన మవ్వలఁ బోవుద మనుటయు నతండు ఓసీ? పిరికిదాన! దీనికి నేను వెఱతునా? మహారణ్యమధ్యంబునఁ గొండలవలె మదమెక్కి తిరుగు మహాగజంబుల కెదురువోయి దంతములు బట్టుకొని నిలబెట్టఁగలము నీకు భయమయిన దూరముగాఁబొమ్ము. నేనా యేనుఁగురాక వేచి యిందే యుండెదనని బీరములు పలికిన విని యాకలికి యులికిపడి కుమారా! నీవు చిన్నవాఁడవు. ఇవి మీ ఏనుఁగులవంటివి కావు. మత్తుపదార్థములు తిని పొగరెక్కి యుండును. పోవుదము రమ్మని బ్రతిమాలికొనియెను.

అతం డందుండి కదలక దారి కడ్డముగా నిలువంబడి దానిరాక వేచియుండెను. అంతలో నామార్గము లన్నియు శూన్యములైనవి. జనులు నలుదెసలకు బారిపోయిరి. అప్పు డాయేనుఁగు తొండముచేఁ దనపై నంబారీలోనున్న వధూవరులం గొట్టుచు మార్గమున కిరుప్రక్కలఁ బాతిన దీపస్తంభములఁ దన్ని నేలఁ బడవేయుచుఁ