పుట:కాశీమజిలీకథలు -09.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్యామల కథ

39

షములం జూపుటకై పయనములు మెల్లగా సాగించుచుండెను. తెఱవున కనతిదూరములో నేదియేని నగరముగాని గ్రామముగాని యున్నచోఁ దీసికొనిపోయి యందలి వింతలు జూపుచుండును.

ఒకనాఁడు దారికడ్డమై పెక్కండ్రు జను లెక్కడికో గుంపులుగాఁ బోవుచుండుటంజూచి యశోకవతి మీరెందు బోవుచున్నారని యడుగుటయు వాండ్రు ఓహో! జగత్ప్రసిద్ధమయిన యుత్సవవిషయములే మీకుఁ దెలియవా? ఈ ప్రాంతమందున్న శ్యామలానగరమున శ్యామలయను రాజపుత్రికకు వివాహము జరిగినది. నేఁ డూరేగింపు సేయుదురు. ఆయుత్సవము లోకాతీతముగాఁ గావింతురని ప్రకటనఁ జేసియున్నారు. ఆ వింతఁ జూచుటకై పోవుచుంటిమని యెఱిగించిరి.

అశోకవతి యావార్త విని పయన మాపి తమశకటంబుల నాదెసకు మరలించినది. ప్రొద్దుగుంకకపూర్వమే యానగరముఁ జేరి యొకసత్రంబున బసఁ జేసిరి. దూరదేశములనుండి యా వైభవము జూచుటకై ప్రజలు సంఘములుగా వచ్చిచేరిరి. రాజమార్గము లన్నియుఁ బ్రజలతో నిండియున్నవి. పట్టణమంతయు విచిత్రముగా నలంకరించిరి. వీధులన్నియు విద్యుద్దీపములచే మెఱయుచుఁ బట్టపగలుగా నొప్పుచుండెను. అది స్వర్గమేమోయని చూచువారి కాశ్చర్యము గలుగఁజేయుచుండెను.

పెందలకడ భోజనముఁ జేయించి యశోకవతి రాజవాహనుని చేయిపట్టుకొని యా యుత్సవములోఁ ద్రిప్పుచుండెను. విల్లమ్ముల దరించి తిరుగుచున్న రాజవాహనుం జూచి జనులు వీరపురుషుఁడని వెఱచుచు దూరముగాఁ దొలఁగుచుండిరి.

ఎనిమిది గంటలు కొట్టినతోడనే యుత్సవము కోటలో నుండి బయలుదేరినది.

సీ. బిరుదువాద్యములు ముందర మ్రోగ నావెన్క
             మంగళగీతముల్ నింగిముట్ట
    వారాంగనాతాండవంబు లావెన్కఁ గృ
             త్రిమచిత్రమృగగటనములు వెనుక
    కోపు లావెన్క బాకులరౌతు లావెన్క
             బుట్టబొమ్మలు వెన్క బట్టువాండ్రు
    నాగవాసంబు వెన్కనె రాజబంధుల్
             వన్నేకాం డ్రావెన్క మన్నెగాండ్రు
గీ. ఇరుగడల సాదు లశ్వంబు లెక్కి నడువ
    రాజబంధు వధూబాలరాజి సదృశ
    వాహనము లెక్కి వెనువెంట వచ్చుచుండ
    నడుమ నొప్పారు భద్రదంతావళమున.