పుట:కాశీమజిలీకథలు -09.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అచ్చరల కథ

37

రాజ – మరేమి వింత లున్నవి?

అశో - నీవు జనించిన తర్వాత నరణ్యమేకాని పట్టణములును, పల్లెలును చూచి యెఱుంగవు. భూమిపై నెన్ని విచిత్రనగరములు, నెన్నియూళ్ళు ఎన్ని వింతలున్నవి ? వానిం జూచినఁ దిరుగ నీవు మీయింటికిఁ బోవుదువా?

రాజ — సరిసరి. మాతలిదండ్రులకు జెప్పకుండ వచ్చితిని. నాకొఱకు మాచెల్లెలు బెంగఁ బెట్టుకొనగలదు నేనెన్నియో దినములు నిలవను. మీరాజపుత్రిక నాకు వెంటనే పిట్టనిచ్చునా?

అశో - (నవ్వుచు) నీకిష్టమైనప్పుడే యుందువుగాక? బలవంతము సేయుము. మాటవరుస కంటిని.

రాజ - అయ్యో! నీవు నాగుఱ్ఱమును నెంత ముందుగా నడిపించినను నడువలేకున్నాను. అడవి యింక చాలచూరమున్నది. గుఱ్ఱము వెనుకభాగమునఁ గూర్చుండెదవా? వేగముగా నడిపింతును?

అశో - ముందేకాని వెనుకఁ గూర్చుండఁ జాలను. మార్జాలకిశోరన్యాయము గాని మర్కటకిశోరన్యాయము పనికిరాదు.

రాజ - నీవు పెద్దమాటలు సెప్పుచుంటివి, ఏమయినం జదివితివా ?

అశో - చదువురానివారల దివాణములలో నంతఃపురకాంతలకుఁ బరిజనులుగా నుండనిత్తురా? చదివితిని.

రాజ - ఏమి చదివితివి ?

అశో - మారాజపుత్రిక జదివిన దంతయు నాకును వచ్చును.

రాజ - మీరాజపుపుత్రిక యేమి చదివినది ?

అశో - అబ్బో! గొప్ప గొప్ప విద్వాంసులే యామెతో మాట్లాడనేరరు. శాస్త్రములు, సంగీతములు, సాహిత్యము, వ్యాయామము పెక్కు విద్యలు వచ్చును. కామశాస్త్ర మంతయు నామెకుఁ గంటోపాకమే.

రాజ — కామశాస్త్ర మనఁగా నేమి? వ్యాకరణమాఁ తర్కమా ?

అశో - తర్కవ్యాకరణములు కావు అందు స్త్రీ పురుషలక్షణములు, కన్యావిస్రంభము, సంభోగవిధానము, దేశకాలప్రకృతి లక్షణములు, వశ్యౌషధములు, మంత్రములు, తంత్రములు, మొదలగు శృంగారవిశేషము లన్నియు నుండును. దానిం జదివినవారే రసికులు నీవేమి చదివితివి?

రాజ -- నేను మా తండ్రిగారి యొద్దనే శాస్త్రము, తర్కవ్యాకరణములు చదివితిని కాని కామశాస్త్రము చదువలేదు. దాని విధాన మెట్లుండునో శ్లోక మొకటి చదువుము.

అశో - వినుము.