పుట:కాశీమజిలీకథలు -09.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

లలామమునకై మేము మహారణ్యములన్నియు వెదకించుచుంటిమని చెప్పిన విని యశోకవతి యిట్లనియె.

శ్రమణీ! యెట్లైన జోడు గూర్పవలయు ననియే నా తలంపు వినుము. నాతో నీయన్న గారిని మానగరమున కనుపుము. ఆయన కాపిట్ట నిప్పించెదను. మా రాజపుత్రిక యౌదార్యమును జూతురుగాక! మీ పిట్టవిషయమై తిరువాత నెట్లు తోచిన నట్లు చేయవచ్చునవి చెప్పిన విని యుబ్బుచుఁ బుళిందకన్య యిట్లనియె.

అశోకవతీ! నీవు నిక్కముగా నాపక్షి నిప్పింతువేని తప్పక మాయన్న నీతో రాఁగలడు. పెద్దవారలకుఁ దెలిసిన ననుమతింపరు రహస్యముగా నీవెంటఁ దీసికొని పొమ్ము. అనిచెప్పి యన్నతో మాట్లాడి యప్పయనమున కంగీకరింపఁ జేసినది.

అశోకవతియు నాకుమారుని పయనము వలన మిక్కిలి సంతసించుచు వారిత్తుమన్న కానుకల నేమియు నందుకొనక వెండియు వచ్చి తీసుకొందునని జెప్పి యొప్పించి బయలుదేరినది. రాజువాహనుఁ డశోకవతి నడవి దాటించి వత్తునని తండ్రికిం జెప్పి యస్వారూఢుఁడై దానివెంట బోయెను. పుళిందపుత్రి యన్నకుఁ జెప్పవలసిన మాటలన్నియుం జెప్పి కొంతదూరము వారిని సాగనంపి వెనుకకు మరలినది.

దారిలో నడచునప్పుడు రాజువాహనుఁడును నశోకవతియు నిట్లు సంభాషించుకొనిరి.

రాజ - అశోకవతీ! మీగ్రామ మెంతదూరమున్నది? ఎన్ని దినములకుఁ బోవుదుము?

అశో - ఈయడవి దాటిన తోడనే మాయంత్రశకటంబు లందున్నవి. వానిమీఁద మూడుదినములకుఁ బోగలము. ఇక్కడికి మారాజధాని నూరామడదూర మున్నది.

రాజ - యంత్రశకటము లననేమి ?

అశో - వానికి జంతువులఁ గట్టము, యంత్రము లావిరిబలమున నడచుచు నతివేగముగాఁ బోఁగలవు.

రాజ - యంత్రమున కావిరి యెట్లు వచ్చును ?

అశో - అదియొక విధమగుచమురు. దానిమూలమున వచ్చును.

రాజ - నాగుఱ్ఱముకన్న వేగముగాఁ బోవునా ?

అశో - నీగుఱ్ఱమునకుఁ గొంతదూరము పరుగెత్తిన నాయాసము వచ్చును. యంత్రము నిర్జీవము. ఎంతదూరమైన నొక విధముగానే పరుగెత్తును.

రాజ - అదియా! మేలు! క్రొత్త వింతలు చూడబడు చున్నవి. ధన్యుండెనే.

అశో - అది యొక్కటియే! అలాటి వెన్నియేనిం జూతువుగాక.