పుట:కాశీమజిలీకథలు -09.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    అప్సర ప్రవరకన్యారత్న మీయోష
                 దానవకన్య యీ తరళనయన
గీ. బ్రహ్మచే వీరు సృష్టింపఁబడిరి తరుణు
   లిరువు రసురుల వంచించు కొఱకు మున్ను
   ధనదుఁ డిందాక తనచెంత నునిచికొనియె
   వారు నిన్గోరుచున్నారు ధారుణీంద్ర.

అని మదనమంజరి యా యాసుందరులం జూపుచు వీరి పెండ్లి యాడుమని కోరిన శిరఃకంపమున నంగీకారము సూచింప నానందింపుడు దేవ యువతులెల్ల నతని మెడలోఁ బుష్పదామంబు వైచి వరించుచు నతని యెడమప్రక్క నిలువంబడుచుండిరి.

అట్లా మహారాజు నూర్వుర దివిజకాంతల గాంధర్వవిధానంబున భార్యలగా స్వీకరించి ప్రమోద మేదుర హృదయుండైయున్న సమయంబునఁ గుబేరుఁడు లేచి యిట్లనియె.

మహారాజా! నీ సద్గుణంబులు వినియుఁ బురుహూతఁ డిందు రానందులకు మిక్కిలి పరితపించుచు నిన్నీ వైభవముతో విమాన మెక్కించి యందుఁ దీసికొని రమ్మని మాతలి నంపియున్నాఁడు. మనమందఱ మీ విభవముతో నందుఁ బోవుదమే యని యడిగిన విక్రమార్కుండు ఆహా! ఇంతకన్న నా కాచరణీయ మేమియున్నది? నేను ధన్యుఁడనేకదా ! ఆశతక్రతుదర్శనము జేసి కృతకృత్యుండ నగుదునని పలికెను.

అప్పు డతని భార్యలతోఁ గూడ నా విమానముమీఁద గూర్చుండఁబెట్టి యందు వచ్చిన వేల్పులతోఁ గూడికొని కుబేరుం డతని నాకమునకుఁ దీసికొనిపోయెను. అమరావతీపురవీథులం దమ్మహారాజు నూరేగింపుచు దేవకాంతలు పూవులు జల్లుచుండ దేవసభాభవనప్రాంగణమునకుఁ దీసికొనిపోయిరి.

అం దతండు విమానంబు దిగి చేతులు జోడించుచుఁ గుబేరాది దిక్పతులు ముందు నడువ సభాంతరాళంబున కరుగుచుండ మహేంద్రుడు కొంతదూర మెదురు వచ్చి యతని నమస్కారము లందికొనుచుఁ జేయిం బట్టుకొని తీసికొనిపోయి తన యర్థసింహాసనమునఁ గూర్చుండఁ బెట్టుకొనియెను.

అప్పుడు దిక్పతులెల్ల తమ తమ పీఠము లలంకరించిరి. గరుడ గంధర్వాదు లొకవంకను దేవతాయతు లొకవంకను సిద్ధ సాధ్యాది సామాజకు లొకవంకను సభ నలంకరించిరి బృహస్పతి లేచి ప్రారంభోపన్యాసమున విక్రమార్కుని గుణముల నభినుతించెను. పిమ్మట దేవేంద్రుం డతని నుపలాలింపుచు వత్సా ! విక్రమార్కా ? ప్రతి నిత్యము నీపు గావించు సాహసాది కృత్యంబు లాదిత్యు లెప్పటి కప్పుడు మా చెవిం బడవేయుచున్నారు. నీ చర్య లొకదాని కన్న నొక టద్భుతముగా నున్నవి.