పుట:కాశీమజిలీకథలు -09.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవకన్యా వివాహము కథ

303

తృణముగానైనఁ బ్రాణమును గణింపవుగదా? నీ చరిత్రమున స్వార్థపరత్వ మించుకయు గానిపింపదే ? నీ సాహసకృత్యములకు మెచ్చుకొని వారు వారిచ్చిన వస్తువు లొక్కొక్కటియే భూలోకమునకు సరిపడియున్న వట్టి వాని గవ్వగానైన గణింపక యర్దులకిచ్చివేసితివే? నీ యౌదార్య మెన్నినాళ్ళు పొగడినను దుదముట్టునా? నీ సుకృతమునకు నా స్వర్గాధిపత్య యొసంగినను సరిపడదు. పెక్కేల వినుము.

క. ఇదివఱకు పుడమి నేలిన
   పృథివీపతులందు నీ ప్రవృత్తిఁగల నృపుం
   డుదయింప లేదె యిఁక ముం
   డుదయింపఁడు నీకు నీవయుద్ది మహాత్మా!

అని పలికినంత దిక్పతులందఱు సత్యము సత్యము అని యతని మాట లనువదించిరి. సభ్యులెల్లరు సురపతి యదార్థము వాక్రుచ్చెనని యుచ్చస్వరంబుల నుచ్చరించిరి. దుందుభులు మ్రోగె. గంధర్వులు పాడిరి. అప్పుడు వినోదముగా రంభోర్వసులు నృత్యముచేసిరి. అప్పుడు తుంబురుం డతని సంగీత విద్యాపాటవంబు దెలియఁదలంచి మహారాజా! ఈ నాట్యము సేయువారలలో నిది రంభ యిది యూర్వశి వీరిద్దరకు నృత్యకళా కౌశల్యములోఁ దగవు గలిగియున్నది. అందలి తారతమ్యము నిరూపింప మావశమైనదికాదు. మీరు సకలకళాపరిపూర్ణులని విని యుంటిమి. వీరి నాట్యము చూచుచుండిరిగదా ? వీరిలో నెవ్వతె నిపుణయో యెఱింగింపుమని యడిగిన నమ్మహారాజు చేతులుజోడించి యిట్లనియె.

గాంధర్వవిద్యాస్వరూపులై యొప్పుచున్న తుంబురు నారద ప్రభృతులచే నలంకరింపఁబడియున్న యీ మహాసభలోఁ గించిజ్ఞుఁడునగు నన్నిట్లడిగిన నేమి చెప్పగలను. అయినను నాకుఁ దోచినంత నుడివి తప్పులు దిద్దించుకొనియెదం గాక. రంభకంటె నూర్వశియే నృత్యవిద్యానైపుణ్యము గలది. అని యందలి కారణంబు లన్నియుం జెప్పి దేవగాయకులనెల్ల నాశ్చర్య సముద్రంబున ముంచివేసెను.

అప్పుడు దేవేంద్రుండు మహారాజా! నీవు సకలవిద్యాపారంగతుండవు. ముప్పదిరెండు సుగుణంబులు నీయందు సంపూర్ణముగా నున్నవి. నీవు పెద్దకాలము భూమిం బాలింపఁగలవు. నీవు గూర్చుండఁదగిన సింహాసనము పుడమియందు లేదు. ముప్పదిరెండు బొమ్మలతో నొప్పుచున్న రత్నసింహాసనము నీ కర్పించుచున్నాను. దానిపైఁ గూర్చుండి ప్రజల బాలింపుము. మఱియుఁ గల్పవృక్షంబు మోక యొకటి నీకిచ్చుచున్నాను. దాని మీ పెరటిలో నాటింపుము. దాని నర్దుల కీయరాదు. మూడు సహస్రవర్షములు నీ యింటనుండును. తజ్జనితంబగు ధనంబు నీ యిష్టము వచ్చినట్లు పంచిపెట్టుకొనవచ్చును. దానంజేసి నీకే కొదువయు నుండదని యుపదేశించి మాతలిని రప్పించి తొంటివిమానముపై భార్యలతో నతని నెక్కించి తానిచ్చిన వస్తువాహనము