పుట:కాశీమజిలీకథలు -09.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవకన్యా వివాహము కథ

299

ననేక మహోత్సవములతో విక్రమార్క చక్రవర్తి నలకాపురవీథుల నూరేగింపుచున్న సమయంబున యక్షకాంతలు సౌధాంతరముల వసించి సంభ్రమముతో నతనిం గాంచుచు,

సీ. వీఁడఁటే మనయక్షువెలఁది కాపాలికా
               ధము బాధఁ బాపిన ధన్యతముఁడు
    వీఁడఁటే నిఖిల పృథ్వీనాథుల జయించి
               కరములందిన పరాక్రమ వినోది
    వీఁడఁటే కిటివెన్క వెసరసాతలమేగి
              బలిచేతఁ బూజింపఁ బడినఱేఁడు
    వీఁడఁటే రవిదత్త పృథుకుండలముల భూ
             సురుల కిచ్చిన సువితరణశాలి
గీ. వీఁడఁటే విక్రమార్క పృథ్వీధవుండు
    అహహ ! ఈతని సౌందర్య మక్కజంబు
    వీనిఁగోరుట సురసతుల్ వింతగాదు
    మూఁడులోకంబులేలంగ వీఁడె దాలు.

అని పౌరనారీజనంబు తద్గుణంబు లగ్గింపుచుఁ బుష్పములు జల్లుచుండ నలకా నగర వీథులన్నియు నూరేగించి వివాహమంటప వేదిం ప్రవేశ పెట్టిరి. ఆ శుభలగ్నమున దేవతావివాహ విధానంబున మాణిభద్రుండును మదనమంజరియుఁ ద్రిపురసుందరిని విక్రమార్క చక్రవర్తికి సాలంకృత కన్యాదానము గావించిరి. అప్పుడు-

క. ఆడిరి సురకాంతలు కొని
   యాడిరి తత్కీర్తిపతను లనురాగముతోఁ
   బాడిరి గంధర్వులు గుమి
   గూడి సురల్ పుష్పవృష్టిఁ గురిపించి రటన్.

భూలోక కోకస్తనీ విలక్షణ నిరుపమ సౌందర్యచాతుర్యాతి శయంబులం బొలుపొందు త్రిపురసుందరిం గాంచి విక్రమార్కుండు ప్రహర్ష సాగరంబున మునుంగుచుండెను. మఱియు నవ్వివాహదీక్షావసాన దివసంబున నలకాపురంబున నమ్మహారాజును గురించి గొప్ప సభ గావించిరి. అందు ముందుగా మాణిభద్రుడు లేచి యమ్మహారాజు తమకుఁ గావించిన యుపకార ముగ్గడించుచుఁ దరువాత నతండు జేసిన సాహసవితరణాది గుణగణంబులఁ దెలియఁజేసెను.

అప్పుడు గరుడ గంధర్వాది దేవతలు ఆ నృపాలునిమీదఁ రచించుకొని వచ్చిన పద్యముల నీరీతిఁ గీర్తించిరి.