పుట:కాశీమజిలీకథలు -09.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(38)

ఐంద్రజాలికుని కథ

297

సౌవిదల్లులు — దేవిగారు గాక మఱియెవ్వరును లేరు మహారాజా!

వీరు — యథారాజా తథాప్రజా అనినట్లు రాజుగారే బొంకుచుండఁ బరిజనులు బొంకకుందురా.

సౌవిద --- శుద్ధాంతమున మీకాంతారత్నము లేదు. మహావీరా ? లేదు. అగ్నింబడుచుండ మేము గూడఁ జూచితిమి.

వీరు - మీ రిప్పుడు పోయి చూచి వచ్చి మఱల జెప్పుడు.

సౌవిద — (అంతఃపురమున కరిగివచ్చి సిగ్గభినయించుచు) మహారాజా ! ఈయన భార్య దేవిగారితో ముచ్చటింపుచు నంతఃపురమున నున్నది. ఎట్లు వచ్చినదో తెలియదు. ఇదేమి చిత్రము ?

రాజు — ఏమీ ? ఆమె యందున్నదా ? వేగఁబోయి తీసికొని రండు.

సౌవిద - అంతఃపురనకుఁ బోయి యాయింతిం దీసికొనివచ్చి యెదురఁ బెట్టిరి. సభ్యులతోఁ గూడ విక్రమార్కుం డాశ్చర్యమందుచు నిదేమి చిత్రమనిమాటాడ లేక యట్టే చూచుచుండెను.

అప్పుడా వీరుండు చేతులు జోడించి జయ విక్రమార్క మహారాజా ! జయ సకలమహీపాల కోటీర ఘటిత మణిగణ కిరణ నీరాజిత చరణయుగళ ! జయ అర్దిజన కల్పభూరుహ ! నేను నిన్నవచ్చిన యెంద్రజాలికుఁడ నిది మదీయేంద్రజాల విద్యా లాఘవము. ఇందులకై మీరు పరితపింప వలదని పలికినంత నమ్మహికాంతుం డత్యంతవిస్మయతరంగితాంతరంగుఁడై వాని మెచ్చుకొనుచు భాండారికుని రప్పించి నిన్న పాండ్యభూపాలుండు పంపిన సుంక మెంత యని యడిగిన వాడిట్లు చదివెను.

శ్లో. అష్టాహాటకకోటయ స్త్రీనవతిర్ముక్తాఫలానాంతులాః
    పంచాశన్మదగంధలుబ్ధమధుపా ధౌరంధరా స్సిందురాః
    అశ్వానాం త్రిశతం చతుర్ధశరథాః పణ్యాంగనానాంశలా
    న్యేతద్విక్రమ భూమిపాల భవతస్తత్పాండ్యరాట్ప్రే షితం.

ఎనిమిదికోట్ల బంగారము తొంబదిమూఁడు తులముల ముక్తాఫలములు నేబది మదపుటేనుఁగులు మూఁడువందల గుఱ్ఱములు పదునాలుగు రథములు రెండువందల మంది వారాంగనలు పాండ్యరాజు నిన్ననే పంపియున్నాఁడని చెప్పగా నా వస్తువు లన్నియుం దెప్పించి యా మహారాజు ఐంద్రజాలికునకుఁ గానుకగా నిచ్చివేసెను. అతండు మిక్కిలి సంతసించుచు నా ధనము గైకొని మహారాజువలె నిజపురంబున కరిగెను.

శ్లో. ఇంద్రజాల విదుభః ప్రవీణతాం
    భూమిజానిరవలోక్య విస్మితః
   పాండ్యభూపతి సమర్పితం ధనం
   దత్తవానితిహివక్తి సాంప్రతం.